Breaking News

మైసూరు గ్యాంగ్ రేప్.. నిందితులను పట్టించిన బస్సు టిక్కెట్లు!


సంచలనం సృష్టించిన మైసూరు సామూహిక అత్యాచార ఘటనలో కీలక ముందడుగు పడింది. పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితులందరూ తమిళనాడుకు చెందిన లేబర్స్ అని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ వెల్లడించారు. తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లాకు చెందిన వీరు.. మైసూరులో రోజుకూలీలుగా పనిచేస్తున్నారని తెలిపారు. నిందితుల్లో ఒకరికి 18 ఏళ్ల లోపు వయస్సున్నట్లు తెలుస్తోందని.. అతడి వయస్సు నిర్ధారణకు ఆధారాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ఆగస్టు 24న మైసూర్ నగర శివారుల్లో ఎంబీఏ విద్యార్థిని అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్‌కు గురైంది. ఆమె వెంటే ఉన్న స్నేహితుడిపై దాడి చేసి ఐదుగురు నిందితులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెను చిత్రహింసలకు గురిచేసి రాక్షసానందం పొందారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేదు. ఈ కారణంగా పోలీసులు ఆమె నుంచి వివరాలు సేకరించలేకపోతున్నారని హోం మంత్రి అరగా జ్ఞానేంద్ర తెలిపారు. తలపై బలంగా కొట్టడంతో బాధితురాలి మిత్రుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి స్టేట్‌మెంట్‌‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం రికార్డ్ చేసింది. ఈ వాంగ్మూలంలో అతడు కీలక విషయాలు వెల్లడించాడు. ఘటన జరిగిన ప్రాంతం తనకు చాలా కాలం నుంచి తెలుసునని, రోజూ అక్కడికి జాగింగ్‌కు వెళ్లేవాడని అతడు తెలిపాడు. ‘ఆ రోజు క్లాస్‌లు అయిపోగానే రాత్రి 7.30 గంటలకు మేం బైక్‌పై బయల్దేరాం. జేఎస్ఎస్ ఆయుర్వేదిక్ కాలేజీ రోడ్డు మీదుగా వెళ్లాం. ఆ స్పాట్‌ నాకు చాలా కాలంగా తెలుసు. అక్కడే బండి ఆపి సరదాగా నడక ప్రారంభించాం. అప్పుడు ఉన్నట్టుండి ఆరుగురు దుండగులు మమ్మల్ని రౌండప్ చేశారు. వారందరూ నన్ను కర్రలతో కొట్టారు. ఆ గ్యాంగులో నుంచి ఒక సన్నని కుర్రాడు వచ్చి, చిన్న బండరాయి తెచ్చి నా ముఖంపై కొట్టాడు. నేను స్పృహ కోల్పోయేంతవరకూ అలా కొడుతూనే ఉన్నారు.. నేను స్పృహలోకి రాగానే నా చుట్టూ నలుగురు గుమిగూడి ఉన్నారు. నా గర్ల్‌ఫ్రెండ్ ఏదని వారిని అడిగాను. అందులో ఇద్దరు వ్యక్తులు పొదల్లో నుంచి ఆమెను లాక్కొచ్చి నా పక్కన పడేశారు. ఆమె దేహం మొత్తం గాయాలతో ఉంది. ఆమె బహుశా అపస్మారక స్థితిలో ఉంది’ అని అతడు చెప్పుకొచ్చాడు. దుండగులు తన మొబైల్ ఫోన్ లాక్కున్నారని అతడు చెప్పాడు. ఆ మొబైల్ నుంచి తన తండ్రికి ఫోన్ చేసి 3 లక్షల రూపాయలు తక్షణమే అరేంజ్ చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపాడు. వారిద్దరినీ వదిలిపెట్టడానికి ముందు రేపిస్టులకు ఆ డబ్బు ముట్టిందా? లేదా? అనేది తెలియరాలేదు. ఈ ఘటనపై కర్ణాటక అట్టుడుకుతోంది. హోంమంత్రి జ్ఞానేంద్ర చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. మైసూరులో ఘటన జరిగితే కాంగ్రెస్ తనను రేప్ చేయాలనుకుంటుదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారమే రేపాయి. బాధితురాలు చీకటి సమయంలో అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందనే వ్యాఖ్యలపైనా అభ్యంతరాలు వచ్చాయి. నిందితులందరూ 25 ఏళ్లలోపు వారే కాగా.. వీరిలో ఒకరు మైనర్ ఉన్నాడు. నిందితులను పట్టుకోడానికి బస్సు టిక్కెట్లు సహకరించాయని పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాల కోసం శోధించిన పోలీసులకు తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరరేషన్ బస్సు టిక్కెట్లు, మద్యం సీసాలు లభించాయి. వీటి ఆధారంగా దర్యాప్తు కొనసాగించడంతో నిందితుల ఆచూకీ లభించింది. తమిళనాడు అధికారుల సాయంతో వారిని పట్టుకున్నారు. నిందితుల్లో ఇద్దరు ఈరోడ్ జిల్లా తలావాడి నుంచి చామరాజ్‌నగర్‌కు రెండు టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి కాల్‌డేటా ఆధారంగా మిగతా నిందితులను పట్టుకున్నట్టు తెలిపారు.


By August 29, 2021 at 11:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bus-tickets-and-liquor-bottles-at-crime-scene-helped-cops-nab-accuses-in-mysuru-gang-rape-case/articleshow/85732282.cms

No comments