Breaking News

పోలీస్ స్టేషన్లలోనే మానవహక్కులకు అధిక ముప్పు.. చీఫ్ జస్టిస్ సంచలన వ్యాఖ్యలు


జాతీయ న్యాయ సేవా కేంద్రం (నల్సా) యాప్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆదివారం ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా న్యాయసేవలు నేరుగా ప్రజలకు చేరువ కానున్నాయి. ఈ సందర్భంగా నల్సా మొబైల్‌ యాప్‌ సేవలపై జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రశంసలు గుప్పించారు. పోలీస్‌ స్టేషన్లలో అత్యధికంగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నా వేధింపులు కొనసాగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మానవహక్కులకు, సమగ్రతకు పోలీస్ స్టేషన్లలోనే అత్యధిక ముప్పు వాటిళ్లడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో కస్టోడియల్‌ టార్చర్‌ సహా పోలీసుల ఇతర వేధింపులు కొనసాగుతున్నాయని సీజేఐ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేక న్యాయసహాయానికి అవరోధాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అంతర్జాల అనుసంధానం మెరుగుపరచాలని కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసినట్లు చెప్పారు. కొవిడ్‌ పరిస్థితుల్లోనూ సమర్ధంగా న్యాయ సేవలు అందించామని సీజేఐ వెల్లడించారు. ‘రాజ్యాంగపరమైన హామీలు ఉన్నప్పటికీ పోలీసు స్టేషన్లలో సమర్థవంతమైన చట్టపరమైన ప్రాతినిధ్యం లేకపోవడం అనేది అరెస్టయిన లేదా నిర్బంధంలో ఉన్న వ్యక్తులకు భారీ నష్టాన్ని కలిగిస్తోంది.. అరెస్టయిన కొద్ది గంటల్లోనే తీసుకున్న నిర్ణయాలు తరువాత నిందితుడు తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి’ అని వివరించారు. ఈ మధ్యకాలంలోనూ నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఆపలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయని అన్నారు. అయితే, ప్రత్యేకంగా ఏ కేసు అనేది మాత్రం సీజేఐ వెల్లడించలేదు. అన్యాయాన్ని అదుపులో ఉంచడానికి పోలీసుల ముందున్న మార్గం ‘చట్టపరమైన సహాయం.. ఉచిత న్యాయ సహాయ సేవల లభ్యత, రాజ్యాంగపరమైన హక్కుల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడం’ అని అన్నారు. ‘ప్రతి పోలీస్ స్టేషన్ లేదా జైలులో డిస్‌ప్లే బోర్డులు, అవుట్‌డోర్ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం ఈ దిశలో ఒక అడుగు.. ఏదేమైనా NALSA కూడా దేశవ్యాప్తంగా పోలీసు అధికారులపై నిఘా చురుకుగా నిర్వహించాలి’ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.


By August 09, 2021 at 07:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/threat-to-human-rights-highest-in-police-stations-says-cji-nv-ramana/articleshow/85167169.cms

No comments