పెళ్లికోసం డ్యూయల్ రోల్ డ్రామా.. కేటుగాడి గట్టురట్టుచేసిన యువతి బంధువు!
వివాహమైన విషయం దాచిపెట్టి మరో యువతితో రెండో పెళ్లికి సిద్ధమైన యువకుడు.. సినీ ఫక్కీలో నాటకమాడాడు. అయితే, చివరి నిమిషంలో అతడి గట్టురట్టుకావడంతో తేలుకుట్టిన దొంగలా జారుకున్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమిళనాడులోని చెన్నై సమీపంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుంబాక్కంకు చెందిన నిందితుడు విలాండర్ బెనెట్‌రాయన్ పోరూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఇదివరకే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ఆవడికి చెందిన యువతి (21)తో రాయన్‌కు పరిచయం ఏర్పడింది. తనకు ఇంకా పెళ్లికాలేదని అబద్దం చెప్పి.. ఆమెను ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడు. అతడి ప్రేమను ఆ యువతి అంగీకరించడంతో ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. కట్నం డబ్బుల కోసం కొడుక్కి పెళ్లయిన విషయాన్ని బెనెట్‌రాయన్ కుటుంబం దాచిపెట్టారు. పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండగా అతడికి పెళ్లయినట్టు యువతికి తన స్నేహితుల ద్వారా తెలిసింది. దీనిపై ఆమె నిలదీయడంతో ఏమాత్రం తడబాటు లేకుండా ఓ కట్టుకథను అళ్లాడు. తనకు ఓ అన్న ఉన్నాడని, అతడు అచ్చుగుద్దినట్లు తనలాగే ఉంటాడని చెప్పాడు. ఈ అబద్ధాన్ని నిజం చేసేందుకు గ్రాఫిక్స్ ద్వారా అన్న పెళ్లిలో తాను పాల్గొన్నట్లుగా ఓ ఫొటో మార్ఫింగ్ చేసి ఆ యువతికి చూపించాడు. దీంతో మీ అన్నయ్యను చూడాలని అడిగితే, దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడని నమ్మించాడు. అతడి మాటలు నిజమేనని నమ్మిన ఆ యువతి, ఆమె కుటుంబసభ్యులు.. పెళ్లికి ఏర్పాట్లు చేశారు. కట్నకానుకలుగా బెనెట్‌రాయన్ కుటుంబానికి రూ.మూడున్నర లక్షలు ఇచ్చారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో యువతి బంధువు ఒకరు బెనెట్‌రాయన్ ఆడుతున్న డబుల్‌రోల్ నాటకాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేశాడు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్నంగా ఇచ్చిన రూ.3.5 లక్షల తిరిగివ్వాలని అడిగితే, బెనెట్‌రాయన్, అతడి కుటుంబీకులు చంపుతామని బెదరించారు. వారి బెదిరింపులతో ఆగ్రహం చెందిన యువతి తల్లిదండ్రులు ఆవడి మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన నిందితుడు బెనెట్‌రాయన్, అతడి తల్లి సెలినా రాయన్ ఇంటి నుంచి పారిపోయారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆ తల్లీకొడుకుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
By August 14, 2021 at 10:49AM
No comments