‘దీదీని పిలవండి.. దేశాన్ని కాపాడండి’ కేరళలో మమతా ఫోటోలతో భారీ పోస్టర్లు
ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం ప్రతిపక్షాల్లో ఆత్మవిశ్వాసం నింపిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో బెంగాల్ బయట కూడా బలపడటానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ‘‘దీదీని పిలవండి.. భారత దేశాన్ని కాపాడండి.. ఢిల్లీ ఛలో ’’ నినాదంతో మమత ఫొటోలున్న భారీ హోర్డింగులను కేరళలోని పలు చోట్ల ఏర్పాటు చేశారు. రాష్ట్ర టీఎంసీ పేరిట ఇంగ్లీషు, మలయాళం భాషల్లో ఈ ఫ్లెక్సీలను వేయించారు. గతంలో తమిళనాడులోనూ ఇటువంటి పోస్టర్లు ఏర్పాటుచేయడం గమనార్హం. 1970 దశకంలో ‘‘ఇందిరను పిలవండి-భారతదేశాన్ని కాపాడండి-ఛలో ఢిల్లీ’’ అన్న నినాదంతో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఫొటోలతో కొచ్చిలో ఇదేతరహాలో పోస్టర్లే ఏర్పాటు చేసినట్లు కేరళకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు చెప్పారు. బెంగాల్‌లో 34 ఏళ్లు అప్రతిహతంగా సాగిన కమ్యూనిస్టుల పాలనకు ముగింపు పలికి.. వారి కంచుకోటను బద్దలుకొట్టి 2011లో అధికారం చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఘనవిజయం సాధించడంతో దేశవ్యాప్తంగా బీజేపీని ధీటుగా ఎదుర్కోగలిగిన నేతగా కొందరు మమతను పరిగణిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీఎంసీ ఇప్పు డు జాతీయస్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్‌రాయ్ వ్యాఖ్యానించారు. ‘ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు.. భారీగా నిరుద్యోగం.. కరోనా సంక్షోభం సమయంలో ఆక్సిజన్ సరఫరా చేయలేకపోవడం.. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వైఫల్యం.. బ్యాంకులు, బీమా, ఆయిల్, గనులు, విమానాశ్రయాలు, పోర్టులను అమ్మకం.. రైల్వే వ్యవస్థ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడం.. పెట్టుబడుదారుల నుంచి సామాన్య ప్రజల వరకు మన యువ తరం జీవితాలు దుర్భరంగా మారాయి.. వారిలో చాలామంది తమ జంతువుల ఉనికిని కూడా కాపాడుకోలేరు.. మానవులు హుందాగా జీవించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం భారతీయులందని ప్రాథమిక హక్కు’ అని అన్నారు. సామాన్యులు, ప్రజాస్వామ్య సంస్థలకు రక్షకురాలిగా మమతాబెనర్జీని దేశవ్యాప్తంగా అందరూ అంగీకరిస్తున్నారని అన్నారు. అయితే, టీఎంసీకి దక్షిణాదిలో సంస్థాగత నిర్మాణంలేదు. కేరళలో వామపక్షాల ప్రభుత్వం ఉంది. ఈ పోస్టర్లపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇవన్నీ టీఎంసీ నాటకాలని, మమతా బెనర్జీ ఎన్నటికీ ప్రధాన మంత్రి కాలేరని దుయ్యబట్టాయి.
By August 08, 2021 at 07:53AM
No comments