Breaking News

ఈ నెలలోనే థర్డ్ వేవ్.. అక్టోబరులో పీక్ స్టేజ్‌కి.. ఐఐటీ సంచలన నివేదిక


దేశంలో ఆగస్టు నెలలోనే ప్రారంభం కానుందని.. అది క్రమంగా పెరుగుతూ అక్టోబరులో గరిష్ఠానికి చేరుకోవచ్చని ఐఐటీ పరిశోధకులు పేర్కొన్నారు. అయితే రెండో దశ విజృంభణతో పోలిస్తే దీని తీవ్రత తక్కువగానే ఉంటుందని తెలిపారు. మ్యాథమెటికల్ మోడల్ ఆధారంగా పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. రెండో వ్యాప్తిపైనా వీరు కచ్చితమైన అంచానా వేయడం గుర్తించుకోవాల్సిన అంశం. హైదరాబాద్‌, కాన్పూర్ ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్లు విద్యాసాగర్‌, మణింద్ర అగర్వాల్‌ నేతృత్వంలో ఈ అధ్యయనాన్ని చేపట్టారు. మూడో దశ వ్యాప్తి పీక్‌లో ఉన్నప్పుడు రోజువారీ కేసుల సంఖ్య లక్షలోపు ఉంటుందని.. పరిస్థితులు మరింత దిగజారితే 1.5 లక్షలకూ చేరొచ్చని అంచనా వేశారు. కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యే కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు పరిస్థితిని హఠాత్తుగా మార్చేయవచ్చని తెలిపారు. రెండో దశ వ్యాప్తిలో ఈ ఏడాది మే 7న గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు అత్యధికంగా రోజుకు 4 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌కు హాట్‌స్పాట్‌లుగా మారుతున్న ప్రాంతాలను సత్వరం గుర్తించడానికి నిరంతర పరిశీలన అవసరమన్నారు. కొత్త వేరియంట్లను గుర్తించడానికి వైరస్‌ జన్యుక్రమాలను మరింత ఎక్కువగా ఆవిష్కరించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ తాజా విజృంభణకు కారణమైన డెల్టా వేరియంట్.. భారత్‌లోనే తొలుత వెలుగు చూసిన అంశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం రోజువారీ కేసులు 40వేలకుపైగా నమోదవుతున్నాయి. దేశంలోని కేరళ, మహారాష్ట్ర, ఈశాన్యం సహా పది రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. కేరళలో ప్రస్తుతం రోజూ 20వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేరళ తదుపరి హాట్‌స్పాట్‌గా మారొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ఇతర రాష్ట్రాల్లోనూ స్వల్పకాలం పాటు కేసులు పెరుగుతున్నాయని నిపుణులు తెలిపారు. కొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఇన్‌ఫెక్షన్లు పెరిగితే.. దేశవ్యాప్త కేసుల సంఖ్య మరోసారి పెరుగుతుందని హెచ్చరించారు. వ్యాక్సినేషన్‌ పెద్ద సంఖ్యలో పూర్తయ్యేవరకూ ఇలాంటి పరిస్థితి ఉంటుందన్నారు. ఇప్పటి వరకూ దేశంలో దాదాపు 44 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేశారు.


By August 03, 2021 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-third-wave-likely-this-month-may-peak-in-october-says-itt-report/articleshow/84994621.cms

No comments