Breaking News

రద్దయిన చట్టం కింద కేసులా.. 4 వారాల్లో బదులివ్వండి: రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు


రద్దు చేసిన సెక్షన్ కింద కేసు నమోదుచేయడాన్ని తీవ్రంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, హైకోర్టులకు సోమవారం నోటీసులు జారీచేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66Aను 2105లోనే రద్దు చేసినప్పటికీ, దాని కింద ఇంకా కేసులు నమోదు చేయడం ఏంటని వ్యాఖ్యానించింది. ఇది పోలీసులు, న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశం కావడంతో ఈ తరహా నోటీసులు పంపించినట్టు జస్టిస్‌ ఆర్ఎఫ్ నారిమన్‌, జస్టిస్‌ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని, కేసుల వివరాలు, అందుకు సంబంధించిన వాదనలను అఫిడ్‌విట్‌లో పొందుపరచాలని సూచించింది. పిటిషన్ వేసిన పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌) తరఫున సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ పారిఖ్‌ వాదనలు వినిపించారు. ఈ కేసుల నమోదులో పోలీసులతో పాటు న్యాయవ్యవస్థకూ పాత్ర ఉందని ఆయన వాదించారు. 2019 ఫిబ్రవరి 15న మరోసారి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ రద్దయిన సెక్షన్‌ కింద పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేయడంతో పాటు, కింది కోర్టుల్లో విచారణలు జరుగుతున్నాయని తెలిపారు. న్యాయవ్యవస్థ వ్యవహారాలను తాము చూస్తామని చెప్పిన ధర్మాసనం.. హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరళ్లకు నోటీసులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అఫిడ్‌విట్ సమర్పించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. పోలీసులు, శాంతి భద్రతల అంశం రాష్ట్రానికి సంబంధించిన అంశమని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి బాధ్యత వహిస్తాయని శ్రేయ సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని గుర్తుచేసింది. ‘‘భారత రాజ్యాంగం ప్రకారం పోలీస్, ప్రజా భద్రత అనేది రాష్ట్రాలకు సంబంధించింది.. నిర్బంధం, నిరోధం, విచారణ.. నేరాల దర్యాప్తు.. పోలీసుల సామర్ధ్యాలను పెంపొందించడం రాష్ట్రాల బాధ్యత.. సైబర్ నేరాలకు పాల్పడినవారిపై చట్టబద్దమైన సంస్థలు చట్టపరంగా చర్యలు తీసుకుంటాయి.. చట్టబద్ధ సంస్థలు తీర్పునకు అనుగుణంగా సమాన బాధ్యతను పంచుకుంటాయి’’ అని పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర హోం శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు.. రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లకు లేఖ రాసినట్టు తెలిపింది. తీర్పు అమలు గురించి ఇప్పటికే 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ అభిప్రాయాలను తెలియజేశాయని పేర్కొంది.


By August 03, 2021 at 09:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-notice-to-states-hcs-on-cases-still-registered-under-scrapped-sec-66a/articleshow/84995270.cms

No comments