Breaking News

శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులు.. కేంద్రం సంచలన నిర్ణయం


గతవారం అసోం, మిజోరం మధ్య సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారి ఏడుగురు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాలను పరిష్కారించేందుకు ద్వారా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులను ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సరిహద్దులను నిర్ణయించే బాధ్యతలను నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎన్‌ఈఎస్‌ఏసీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, నార్త్ ఈస్ట్ కౌన్సిల్‌కు అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులను ఖరారుకు ఈ ఏడాది జనవరి 23 న జరిగిన ఎన్‌ఈఎస్‌ఏసీ సమావేశంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి ఆమోదముద్ర వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. షిల్లాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ వరదల నిర్వహణ కోసం ఇప్పటికే అంతరిక్ష సాంకేతికతను వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లోని అంతరాష్ట్ర సరిహద్దులు, అటవీ ప్రాంతాలను శాటిలైట్ ఇమేజింగ్ వ్యవస్థ ద్వారా గుర్తించడం శాస్త్రీయంగా ఉంటుందనే ఆలోచనకు వచ్చింది. సరిహద్దుల నిర్ధారణకు శాస్త్రీయ పద్ధతులు అందుబాటులోకి వస్తే వ్యత్యాసాలకు తావు లేకుండా ఉండటమే కాకుండా అన్నిరాష్ట్రాలు ఆమోదించే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దశాబ్దాలుగా అసోం, మిజోరం సరిహద్దు వివాదం కొనసాగుతోంది. జులై 27న వివాదం ఘర్షణలకు దారితీసి ఇరు రాష్ట్రాల పోలీసులు ఒకరిపై ఒకరు దాడిచేసుకోవడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అసోంలోని కాచర్‌ జిల్లా, మిజోరంలోని కోలాసిబ్‌ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు వద్ద స్థానికులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారి ఏడుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వివాదం మరింత బిగుసుకుంటుందని కేంద్రం అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘సరిహద్దుల నిర్ధారణలో శాస్త్రీయ హేతుబద్ధత ఉన్నందున ఏ పక్షపాతానికి చోటు ఉండదు.. సరిహద్దు వివాదం పరిష్కారాలకు మెరుగైన ఆమోదం రాష్ట్రాల ద్వారా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఉభయ రాష్ట్రాల సీఎంలు హిమంత బిశ్వ శర్మ, జోరాంథంగాలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం ఫోన్‌లో చర్చలు జరిపారు. సంప్రదింపుల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని నిర్ణయించామని మిజోరాం సీఎం జోరాంథంగా తెలిపారు.


By August 02, 2021 at 10:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/assam-mizoram-disputes-northeast-borders-to-be-demarcated-through-satellite-imaging/articleshow/84964771.cms

No comments