Breaking News

కాబూల్ నుంచి అమెరికాకు చివరి విమానం.. ముగిసిన అఫ్గన్ యుద్ధం: పెంటగాన్ కీలక ప్రకటన


అఫ్గన్ గడ్డపై అమెరికా సైన్యం తరలింపు మంగళవారంతో పూర్తయ్యింది. దీంతో రెండు దశాబ్దాల క్రూరమైన యుద్ధం ముగిసింది. తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్న అఫ్గన్‌ పునఃనిర్మాణానికి అమెరికా బిలియన్ డాలర్లు ఖర్చుచేసినప్పటికీ.. లక్ష్యం నెరవేరలేదు. ఇస్లామిక్ తాలిబన్ల అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభమైన యుద్ధం.. మళ్లీ వారి పాలనతోనే ముగియడం గమనార్హం. అమెరికా యుద్ధం ముగియడంతో మంగళవారం తెల్లవారుజామున కాబూల్‌లో వేడుకలకు గుర్తుగా గాల్లోకి కాల్పులు జరిగాయి. ఈ సంఘటనపై తాలిబాన్ సీనియర్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. యుఎస్ నేతృత్వంలోని యుద్ధానికి సహకరించిన పదివేల మంది అమెరికన్లు, అఫ్గన్‌ల తరలింపు ప్రక్రియ చివరి రోజుల్లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. కాబూల్ విమానాశ్రయం వద్ద గత వారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులు సహా అఫ్గన్ పౌరులు మొత్తం 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తామే పాల్పడినట్టు ఐఎస్-కే ఉగ్రవాదులు ప్రకటించిన విషయం తెలిసిందే. తరలింపు ప్రక్రియలో జాప్యం జరిగితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని అమెరికా భావించింది. బాంబు దాడులను లెక్కచేయకుండా నిర్దేశించుకున్న గడువులోగా పూర్తిచేసింది. మరోవైపు, తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంతో అఫ్గన్‌కు ఎదురయ్యే ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకుంది. రెండు దశబ్దాలు యుద్ధం ముగిసిందని, ఆగస్టు 31లోగా సైన్యం ఉపసంహరణ పూర్తిచేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ యుద్ధంలో 2,400 మందికిపైగా అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అఫ్గన్‌లో సైన్యం ఆపరేషన్, అమెరికా పౌరుల తరలింపు పూర్తయినట్టు యూఎస్ జనరల్ కెన్నెత్ మెకెంజీ ప్రకటించారు. ‘అఫ్గన్‌లో సైనిక ఆపరేషన్, అక్కడ చిక్కకున్న అమెరికా పౌరుల తరలింపు పూర్తయిన్నట్టు ప్రకటన చేయడానికి ఇక్కడ ఉన్నాను.. ఈ రోజు నాతకని ఉపసంహరణ అనేది సైనిక ఆపరేషన్ ముగింపును సూచిస్తుంది... అంతేకాదు, 2001 సెప్టెంబరు 11 తర్వాత అఫ్గన్‌లో ప్రారంభమై దాదాపు 20 ఏళ్లు కొనసాగిన యుద్ధం ముగింపును కూడా సూచిస్తుంది’ అని తెలిపారు. అఫ్గన్ నుంచి చివరి విమానం కాబూల్ విమానాశ్రయంలో సోమవారం రాత్రి 7.30 గంటలకు టేకాఫ్ అయ్యిందని ఆయన వివరించారు. మంగళవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అటు, అమెరికా సైన్యాల ఉపసంహరణతో అఫ్గన్లకు పూర్తి స్వాతంత్రం వచ్చిందని అధికార ప్రతినిధి జబిహుల్లాహ్ ముజాహిద్ ప్రకటించగా.. ఈ చరిత్రాత్మక సన్నివేశానికి సాక్ష్యం నిలవడం గర్వంగా ఉందని తాలిబన్ సీనియర్ నేత అనస్ హక్కానీ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తి కావడంతో కాబూల్ నగరంలోని తాలిబన్ చెక్‌పోస్ట్‌ల వద్ద సంబరాలు చేసుకున్నారు.


By August 31, 2021 at 07:10AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pentagon-announces-last-us-troops-leave-afghanistan-ending-20-year-war/articleshow/85785276.cms

No comments