Breaking News

పాక్ సరిహద్దుల్లో భారీ టిఫిన్ బాక్స్ బాంబు.. డ్రోన్‌తో జారవిడిచిన ఉగ్రవాదులు


స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో పాక్ ఉగ్రవాదులు విధ్వంసానికి కుట్రలు పన్నినట్టు నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీ టిఫిన్ బాక్సు బాంబు లభించింది. పాక్ సరిహద్దుల్లోని పంజాబ్‌లోని అమృత్‌సర్‌ గ్రామీణ జిల్లా మారుమూల గ్రామం ధలికేలో 2 కిలోల ఆర్డీఎక్స్‌తో కూడిన శక్తిమంతమైన టిఫిన్‌ బాక్స్‌ బాంబు, మరికొన్ని పేలుడు పదార్థాలు దొరకడం కలకలం రేగుతోంది. పాకిస్థాన్‌ నుంచి డ్రోన్‌ సాయంతో వీటిని జారవిడిచినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. గ్రామంలో ఆదివారం సాయంత్రం ఓ బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా బ్యాగులో పేలుడు పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. టిఫిన్‌ బాక్సులో అమర్చిన బాంబు, ఐదు చేతి గ్రెనేడ్లు, 100 రౌండ్ల 9 ఎంఎం క్యాట్రిడ్జ్‌లు, రిమోట్‌ కంట్రోల్‌, ఓ స్విచ్‌, సర్క్యూట్‌ బోర్డు, 9 ఓల్టుల బ్యాటరీ, మూడు డిటొనేటర్లు అందులో ఉన్నాయి. పాకిస్థాన్‌ సరిహద్దుల నుంచి డ్రోన్‌ ద్వారా వీటిని తెచ్చి ఇక్కడ జారవిడిచి ఉంటారని పంజాబ్‌ డీజీపీ దినకర్‌ గుప్తా చెప్పారు. ఆగస్టు 7 శనివారం రాత్రి భారీ డ్రోన్ శబ్దాలు విన్నట్టు గ్రామస్థులు తెలిపారు. ఆ మర్నాడు ఆదివారం సాయంత్రం పేలుడు పదార్థాలతో కూడిన బ్యాగు లభించిందని డీజీపీ వివరించారు. ఈ ఘటన వెనుక ఖలిస్థాన్ అనుకూలవాదుల హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నామని అన్నారు. ఈ దిశగా తమ దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. స్కూల్ పిల్లలు లంచ్ తీసుకెళ్లే ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులోనే బాంబును అమర్చినట్టు పేర్కొన్నారు. దీనిపై నేషనల్ సెక్యూర్టీ గార్డ్ (ఎన్‌ఎస్జీ) ప్రాథమిక విచారణ చేపట్టిందన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. బ్యాటరీ అమర్చిన టిఫిన్ బాక్సు బాంబులను మొబైల్ ఫోన్‌ సాయంతో పాఠశాలలు, రద్దీ ప్రదేశాల్లో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడతారు. కాగా, జమ్మూ-కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో భద్రత దళాలు ఓ ఉగ్రవాద స్థావరంపై దాడి చేసి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. సోమవారం సంగద్‌ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరం నుంచి రెండు ఏకే-47 తుపాకులు, 257 రౌండ్లతో కూడిన 4 ఏకే-47 మేగజీన్లు, చైనీస్‌ పిస్టల్‌, 68 రౌండ్లతో కూడిన పిస్టల్‌ మేగజీన్‌, రేడియో పరికరాలు, 13 డిటొనేటర్లు, 4 గ్రెనేడ్లు భద్రత సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.


By August 10, 2021 at 09:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tiffin-box-bomb-recovery-in-punjab-village-at-india-pakistan-border/articleshow/85199802.cms

No comments