ప్రేమ పిచ్చోడు.. ప్రియురాలి కోసం 21ఏళ్లుగా ఎదురుచూస్తూ మతి తప్పి...


ఈ ప్రపంచంలో ప్రేమను మించిన వ్యసనం లేదని అంటారు. ప్రేమించిన వ్యక్తి కోసం కొందరు ప్రాణాలు తీస్తుంటే.. మరికొందరు పిచ్చివాళ్లుగా మారిపోతున్నారు. ఇలాగే ఓ వ్యక్తి తన ప్రియురాలు ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఎదురుచూస్తూ పిచ్చివాడైపోయాడు. అలా అతడు ఒకటి రెండేళ్లు కాదు ఏకంగా 21ఏళ్లు ప్రియురాలు కోసం ఎదురుచూశాడు. ఈ ఘటన తమిళనాడులోని పుదుకోట్టైలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.... పుదుకోట్టై జిల్లాలోని పొన్నమరావతి సమీపం మూలక్కుడి గ్రామానికి చెందిన నాగరాజన్ (40) దాదాపు 21 ఏళ్ల క్రితం కుటుంబాన్ని పోషించేందుకు కోయంబత్తూర్‌కు వెళ్లి ఓ కిరాణా షాపులో పనిచేశాడు. ఆ సమయంలో కేరళకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తన తోబుట్టువులకు పెళ్లి అయ్యాక వివాహం చేసుకుందామని చెప్పి ఆమెను మూలక్కుడికి తీసుకొచ్చాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు కారులో వచ్చి బలవంతంగా ఆమెను తీసుకుపోయారు. ఈ ఘటనతో షాకైన నాగరాజన్ తన ప్రియురాలు ఎప్పటికైనా వస్తుందన్న ఆశతో రోడ్డు మీదే కూర్చుని ఎదురుచూసేవాడు. ఈ క్రమంలోనే ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోవడంతో అతడి మతిస్థిమితం తప్పింది. ఆ తర్వాత కొన్నిరోజులకు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఉన్న చిన్న రాతిబండ వద్ద గుడిసె ఏర్పాటు వేసుకుని అందులో ఉండసాగాడు. అతడికి తల్లి నాగాయి ఆహారం ఇచ్చి వెళ్తుంటుంది. ఎవరితోనూ మాట్లాడకుండా అక్కడే నిరీక్షిస్తున్న నాగరాజన్ విషయం ఇటీవలే జిల్లా అధికారులకు చేరింది. దీంతో వారు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సాయంతో అతడిని చికిత్స కోసం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
By August 10, 2021 at 10:13AM
No comments