Breaking News

పఠాన్‌కోట్ దాడిలో సంచలన విషయాలు.. ఉగ్రవాదులకు సహకరించిన స్థానిక అవినీతి పోలీసులు!


పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై 2016లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాదులకు అవినీతిపరులైన కొందరు స్థానిక పోలీసులు సహకరించినట్టు అంతర్జాతీయ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌లు ఆండ్రియాన్‌ లెవీ, క్యాథీ స్కాట్‌-క్లార్క్‌లు తాము రాసిన పుస్తకంలో వెల్లడించారు. ‘స్పై స్టోరీస్‌: ఇన్‌సైడ్‌ ద సీక్రెట్‌ వరల్డ్‌ ఆఫ్‌ ద ఆర్‌ఏడబ్లూ (రా) అండ్‌ ఐఎస్‌ఐ’ అనే పుస్తకంలో పఠాన్‌కోట్ ఉగ్రదాడులను జర్నలిస్ట్‌లు ప్రస్తావించారు. భారత సైనికుల దుస్తులను ధరించిన కొందరు ఉగ్రవాదులు 2016 జనవరి 2 పంజాబ్‌లోని భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని రావి నదిని దాటి పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో భద్రతా దళాలతో ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు, ముగ్గురు సైనికులు చనిపోయారు. మర్నాడు జరిగిన పేలుడులో మరో నలుగురు భారత సైనికులు అమరులయ్యారు. వైమానిక స్థావరం మొత్తాన్నీ తమ అదుపులోకి తెచ్చుకోవడానికి భారత సైన్యానికి మూడు రోజులు పట్టింది. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌ హస్తం ఉందని ఆరోపించిన భారత్‌.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు పంపింది. ‘భారత నిఘా వర్గాల అంతర్గత నివేదికలు కచ్చితంగా ఉన్నాయి.. ఈ ప్రాంతానికి పొంచి ఉన్న ముప్పుపై నిరంతరం హెచ్చరికలు చేసినా తగిన రక్షణ చర్యలు తీసుకోలేదు.. పంజాబ్‌లోని 91 కిలోమీటర్ల మేర పాకిస్థాన్ సరిహద్దుకు కంచె వేయలేదు.. నదులు, ఎండిపోయిన నదీ పాయల వద్ద అప్రమత్తత అవసరమని నాలుగు నివేదికలు హెచ్చరించాయి.. అయినా అక్కడ రక్షణ చర్యలు చేపట్టలేదు. లిఖితపూర్వకంగా ఆరు సార్లు విజ్ఞప్తి చేసినా.. అదనపు గస్తీ దళాలను నియమించలేదు. నిఘా పరిజ్ఞానం, కదలికలను గుర్తించే ట్రాకర్‌ సాధనాలను ఏర్పాటు చేయలేదు’ అని పుస్తకంలో తెలిపారు. ‘పఠాన్‌కోట్‌ దాడి కోసం 350 కిలోల పేలుడు పదార్థాలను సమకూర్చుకోవడానికి జైషే మహ్మద్‌ సంస్థ ఉగ్రవాద సంస్థ చెల్లింపులు చేసింది.. వాటిని భారత్‌లోనే కొనుగోలు చేశారు... ఒక పోలీసు అధికారి గానీ అతడు ఏర్పాటు చేసిన వ్యక్తి గానీ వైమానిక స్థావరం గోడ పైకి ఎక్కి, తాడు కట్టారని కేసు దర్యాప్తు చేసిన ఐబీ అధికారి ఒకరు చెప్పారు.. ఈ తాడు సాయంతో ముష్కరులు 50 కిలోల పేలుడు పదార్థాలు, 30 కిలోల గ్రెనేడ్లు, మోర్టార్లు, ఏకే-47 తుపాకులను వైమానిక స్థావరంలోకి చేరవేశారు’ అని పేర్కొన్నారు. ‘సరిహద్దుల్లో రక్షణ చర్యల విషయమై జమ్మూ కశ్మీర్‌లోనే కేంద్రీకరించడం వల్ల పంజాబ్‌లో తక్కువ సిబ్బందిని నియమించినట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) అధికారి ఒకరు చెప్పారు.. ఇక్కడ అదనపు బలగాలను మోహరించాలన్న తమ విజ్ఞప్తిని ఉన్నతాధికారులు పదేపదే విస్మరించారని ఆయన తెలిపారు. ‘అవినీతిపరులైన స్థానిక పోలీసు అధికారులు సహా పలువురు ఎయిర్‌బేస్‌‌పై దాడికి సహకరించినట్టు భారత మిత్రదేశాలు అనుమానించాయి.. అవినీతి పోలీసులలో ఒకరు వైమానిక స్థావరంలోని బలహీన ప్రాంతాన్ని గుర్తించాడు.. ఫ్లడ్‌లైట్లు డౌన్ అయ్యాయి.. సీసీటీవీ కెమెరాలకు కవరేజ్ లేదు.. ప్రహరీ గోడ పక్క ఒక పెద్ద వృక్షం ఉన్నా.. అక్కడ ఏ విధమైన నిఘా పరికరాలు లేవు.. దీనిని భద్రతకు ప్రమాదంగా గుర్తించినట్టు నివేదికలో లిఖితపూర్వకంగా పేర్కొన్నారు’ అని జర్నలిస్ట్‌లు వివరించారు. సరిహద్దుకు ఇరువైపులా అనుభవజ్ఞులైన అధికారుల ద్వారా గూఢచారి ఆటలు ఆడుతున్నాయి.. గతాన్ని ఒకసారి సవరించిన తర్వాత భవిష్యత్తు మసకగా ఉంటుందని తెలుసు.. గూఢచర్యం ఆరోపణలపై పాక్‌లో మరణశిక్ష విధించిన భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌‌ను భారత్ కుట్రదారుడిగా ఐఎస్ఐ ఎలా చిత్రీకరించిందో కూడా ఈ పుస్తకం పేర్కొంది.


By August 14, 2021 at 09:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/corrupt-local-police-officers-facilitated-terrorists-entry-into-pathankot-airbase-book/articleshow/85320234.cms

No comments