Afghanistan జనం నిద్రలేచేసరికి మరో పట్టణంలో ఎగిరిన తాలిబన్ జెండాలు.. ఏ క్షణమైనా కాబూల్‌లోకి!
అఫ్గనిస్థాన్ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్ మూకలు ముందుకు సాగుతున్నాయి. అఫ్గన్‌లోని 18 ప్రావిన్సులను ఇప్పటి వరకూ ఆక్రమించుకున్నారు. తాజాగా, రాజధాని కాబూల్‌కు సమీపంలోని జలాలాబాద్‌లోకి ప్రవేశించారు. ఆదివారం ఉదయం ప్రజలు నిద్రలేచేసరికి పట్టణంలో తాలిబన్ల జెండాలు ఎగిరాయి. దీంతో కాబూల్‌లోకి ఏ క్షణమైనా ప్రవేశించే అవకాశం ఉంది. జలాలాబాద్‌ను తాలిబన్ వేర్పాటువాదులు ఆక్రమించుకోవడంతో తూర్పు ప్రాంతాలతో కాబూల్‌కు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఉత్తర ప్రాంతంలో తాలిబన్ వ్యతిరేక కంచుకోటగా గుర్తింపు పొందిన మజార్-ఇ-షరీఫ్‌ను స్వాధీనం చేసుకున్న కొద్ది గంటల్లోనే జలాలాబాద్‌పై పట్టుసాధించారు. ఆశ్చర్యకరంగా కేవలం 10 రోజుల్లో ప్రభుత్వ దళాలు, యుద్ధ సైనికులు పరాజయం చవిచూశారు. ‘తెల్లవారి నిద్రలేచేసరికి పట్టణమంతా తాలిబన్ల తెల్లజెండాలు ఎగురుతున్నాయి.. ఎటువంటి పోరాటం చేయకుండానే జలాలాబాద్‌లోకి ప్రవేశించారు’ అని అహ్మద్ వలీ అనే స్థానికుడు సోషల్ మీడియాలో ధ్రువీకరించాడు. తాలిబాన్లు కాబూల్‌ని చుట్టుముట్టడంతో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వానికి రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. రాజధాని కోసం రక్తపాత పోరాటానికి సిద్ధపడండి లేదా లొంగపోవడం. శనివారం జాతినుద్దేశించి ప్రసంగించిన అష్రఫ్ ఘనీ.. సంక్షోభానికి ‘రాజకీయ పరిష్కారం’ కోరుతూ సైన్యాన్ని ‘తిరిగి సమీకరించడం’ గురించి మాట్లాడారు. కానీ, మజార్-ఇ-షరీఫ్, జలాలాబాద్‌లను వెంటవెంటనే కోల్పోవడం ఘనీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. మరి కొద్ది గంటల్లోనే కాబూల్‌లోకి తాలిబన్లు చొరబడే అవకాశం ఉంది. అమెరికా దళాల కోసం పనిచేసి.. తాలిబాన్ ప్రతీకార చర్యలకు భయపడుతున్న ఎంబసీ ఉద్యోగులు, వేలాది మంది అఫ్గన్లను నుంచి అత్యవసరంగా తరలింపు చర్యలకు సహాయపడటానికి అదనంగా మరో 1,000 మంది యూఎస్ సైనికులను మోహరించాలని అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశించారు. రెండు రోజుల కిందటే 3,000 మంది అమెరికన్ సైనికులను మోహరించారు. అఫ్గనిస్థాన్‌లో 20 ఏళ్ల సైనిక ఉనికి ఉపసంహరణ సెప్టెంబర్ 11 నాటికి పూర్తవుతుందని ఈ ఏడాది మేలో బిడెన్ ప్రకటించిన తర్వాత వేలాది మంది అమెరికా సైనికులు తరలిపోయారు. అఫ్గన్ భూభాగం నుంచి అమెరికా సైన్యాలను ఉపసంహరించుకోవాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఆయన తర్వాత అధికారం చేపట్టిన జో బైడెన్ కొనసాగించారు. అమెరికా సైన్యం వెనక్కు మళ్లడంతో తాలిబన్లు మరోసారి అఫ్గన్‌లో తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. తాలిబన్‌లను నిలువరించడంలో అఫ్గన్ సైన్యాలు చేతులెత్తుస్తున్నాయి. అఫ్గన్ గడ్డపై 2002 కి ముందు తాలిబన్లు సృష్టించిన విధ్వంసం వారిని పీడకలలా వెంటాడుతోంది. మళ్లీ వాళ్లు అధికారం చేపడితే అరాచకాలకు, ఆగడాలకు అంతే ఉండదని భయపడుతున్నారు.
By August 15, 2021 at 01:43PM
No comments