Breaking News

కాబూల్‌లో ఐఎస్ ఉగ్రవాదుల ఘాతుకం.. నాలుగు చోట్ల ఆత్మాహుతి దాడి..72 మంది మృతి


కాబూల్ విమానాశ్రయం, దాని పరిసర ప్రాంతాల్లో భారీ ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందని.. తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అమెరికా హెచ్చరికలు చేసిన కొద్ది గంటల్లో ముష్కరులు పేట్రేగిపోయారు. కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విదేశీ పౌరులే లక్ష్యంగా ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. మూడు మానవబాంబు దాడుల్లో.. మహిళలు, చిన్నారులు, అమెరికా సైనికులు సహా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అఫ్గన్‌ వర్గాలు తెలిపారు. ఈ ఆత్మాహుతి దాడిలో మరో 140 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో అమెరికా భద్రత దళాలకు చెందిన పలువురు సైనికులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం కాబూల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న అమెరికా సైనికులను ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా తరలించారు. కాబూల్ విమానాశ్రయంలో ఎటు చూసినా హాహాకారాలు.. కకావికలై పరుగులు తీస్తున్న జనం.. ఎటుచూసినా రక్తపు ముద్దలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో భీతావాహ వాతావరణం నెలకుంది. తాలిబాన్ల పాలనలోకి వెళ్లిన అఫ్గన్ నుంచి విదేశీయులు, అక్కడి ప్రజలు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఆగస్టు 15 నుంచి కాబూల్ విమానాశ్రయానికి వేలాది మంది తరలివస్తున్నారు. వీరిని టార్గెట్‌గా చేసుకుని ఐఎస్‌ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల నిఘావర్గాలు హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ ఘోరం జరగడం గమనార్హం. ఐఎస్-కేపీ (ఖోరాసన్‌ ప్రావిన్స్‌) ఉగ్రవాదులు విమానాశ్రయం, దాని పరిసరాల్లో గుమిగూడిన విదేశీయులే టార్గెట్‌గా పేలుళ్లకు పాల్పడనున్నట్లు బ్రిటిష్‌ సాయుధ బలగాల మంత్రి జేమ్స్‌ హీపే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్‌ పేన్‌ బుధ, గురువారాల్లో వేర్వేరు ప్రకటనలు చేశారు. ‘విమానాశ్రయం బయట అబే గేట్‌, తూర్పు, ఉత్తర గేట్ల వద్ద ఉండే వారు జాగ్రత్త.. వెంటనే ఆయా ప్రదేశాలను వీడి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి. అక్కడ మానవబాంబు దాడులు జరిగే ప్రమాదముంది’’ అంటూ ఫారిన్‌, కామన్వెల్త్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీ‌స్ హెచ్చరించింది. విమానాశ్రయానికి కూడా వెళ్లొద్దని, ఆయా మార్గాల్లో కూడా కారు బాంబులతో ఐఎస్‌ ఉగ్రమూకలు విరుచుకుపడే ప్రమాదముందని అప్రమత్తం చేసింది. నిఘావర్గాల అంచనాలను నిజం చేస్తూ ఐఎస్‌ ఉగ్రవాదులు గురువారం సాయంత్రం 5.11 సమయంలో విమానాశ్రయంలోని అబే గేటు వద్ద తొలి ఆత్మాహుతి దాడి చేశారు. అబే గేటు వద్ద పేలుడు జరిగిన అరగంటకు స్థానిక బొరాన్‌ హోటల్‌ నుంచి విమానాశ్రయానికి దారి తీసే ప్రదేశంలో మరో మానవబాంబు దాడి జరిగింది. ఈ ప్రాంతంలో బ్రిటన్‌లో శరణార్థులకు అనుమతి పత్రాలు జారీ చేస్తున్నారు. ఈ రెండు ఘటనలు జరిగిన గంటల వ్యవధిలో.. ఐఎస్‌ ఉగ్రవాదులు రోడ్డుపై అమర్చిన ఐఈడీతో తాలిబాన్ల వాహనం పేలింది. ఈ ఘటనలో పలువురు తాలిబాన్లు చనిపోయారు. అబే గేటుకు సమీపంలో ఎయిర్‌పోర్టు గోడ వద్ద గుమిగూడిన అఫ్ఘాన్లే టార్గెట్‌గా మరో మానవబాంబు దాడి జరిగింది. కారులో పేలుడు పదార్థాలతో వచ్చిన ముష్కరుడు తనను తాను పేల్చుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇప్పటి వరకూ బాంబు పేలుళ్లలో 60 మంది చనిపోయారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు తెలిపారు. తాలిబాన్లు కూడా ఈ ఘటనలను ఖండించారు. పలువురు తాలిబాన్లు చనిపోగా.. క్షతగాత్రుల్లో ముగ్గురు తాలిబాన్‌ గార్డులు ఉన్నట్లు తెలిపారు. ఒక్క బొరాన్‌ హోటల్‌ వద్ద 52 మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు వివరించారు. అబే గేటు వద్ద, ఎయిర్‌పోర్టు ప్రహరీకి సమీపంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పారు. ఈ దాడులు తమ పనే అని ఐఎస్‌ అధికారికంగా ప్రకటించింది.


By August 27, 2021 at 07:05AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/afghanistan-at-least-60-dead-in-kabul-suicide-blasts-isis-claims-responsibility/articleshow/85675485.cms

No comments