Breaking News

వచ్చే 36 గంటల్లో కాబూల్‌లో మరో ఆత్మాహుతి దాడి.. బైడెన్ హెచ్చరిక


‘కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదులు మరోసారి ఆత్మాహుతి దాడికి పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు నమ్ముతున్నాయి.. ఈ దాడి వచ్చే 24 నుంచి 36 గంటల్లోగా జరిగే ప్రమాదం ఉంది’ అని అధ్యక్షుడు శనివారం హెచ్చరించారు. ఉగ్రవాద హెచ్చరికలతో యుఎస్ బలగాలు పర్యవేక్షణలో జరుగుతున్న తరలింపు ప్రయత్నాలకు ఆటంకంగా మారింది. ప్రధాన గేట్ల వద్ద గురువారం నాటి మారణహోమం పునరావృతం కాకుండా ఉండేందుకు తాలిబన్‌లతో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యింది. ‘నిర్దిష్టమైన, విశ్వసనీయమైన సమాచారం ప్రకారం ముప్పు పొంచి ఉంది.. కాబూల్ విమానాశ్రయం పరిసరాల్లోని అమెరికా పౌరులంతా ఆ ప్రాంతం నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి’ అని కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. ‘ దక్షిణ (ఎయిర్‌పోర్ట్ సర్కిల్) గేట్, కొత్త ఇంటీరియర్ మినిస్ట్రీ, ఎయిర్‌పోర్టుకు వాయువ్య దిశలో పంజ్‌షీర్ పెట్రోల్ స్టేషన్ సమీపంలో ఉన్న గేట్’ వద్ద ఆత్మాహుతి దాడికి తెగబడే ముప్పు ఉందని అమెరికా ఎంబసీ తెలిపింది. విమానాశ్రయంలో గురువారం జరిగిన మారణకాండకు బాధ్యత వహిస్తున్న ఇస్లామిక్ స్టేట్-ఖోరాసన్ లక్ష్యంగా చేసుకుని అమెరికా డ్రోన్ దాడి చివరిది కాదని జాతీయ భద్రతా బృందంతో చర్చించిన అనంతరం బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది.. విమానాశ్రయానికి ఉగ్ర దాడుల ముప్పు ఎక్కువగా ఉంది.. రాబోయే 24-36 గంటల్లో దాడి జరిగే అవకాశం ఉందని మా కమాండర్లు నాకు తెలియజేశారు’ అని బైడెన్ చెప్పారు. గురువారం సాయంత్రం జరిగిన ఆత్మాహుతి దాడిలో 130 మంది అమెరికా సైనికులు సహా 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఐఎస్-కే స్థావరాలపై అమెరికా శుక్రవారం డ్రోన్ల దాడులతో విరుచుకుపడింది. తమ దాడి లక్ష్యం నెరవేరిందని అమెరికా ప్రకటించింది. ఈ దాడిలో ఐఎస్-కే కీలక నేత సహా పలువురు హతమైనట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కాబూల్‌ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడుల సూత్రధారిని ఉపేక్షించేది లేదు. అలాంటి వారు ఈ భూమ్మీద బతకడానికి అర్హులు కాదు..’’.. అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శపథం చేసిన 24 గంటల్లోనే.. అమెరికా డ్రోన్‌ దాడుల్లో ఇస్లామిక్‌ స్టేట్‌(ఖోరాసన్‌) దాడుల సూత్రధారిని మట్టుబెట్టింది.


By August 29, 2021 at 08:07AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/new-attack-on-kabul-airport-highly-likely-in-24-36-hours-joe-biden/articleshow/85730380.cms

No comments