Breaking News

ఏపీ సహా పది రాష్ట్రాల్లో 10%పైగా పాజిటివిటీ.. కేంద్రం కీలక హెచ్చరికలు


దేశంలో రెండో దశ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా కొన్ని రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు ఆందోళనకు గురిచేస్తోంది. పది రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటీవిటీ రేటు 10 శాతం ఎక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. పాజిటివిటీ రేటు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్దేశించింది. 46 జిల్లాల్లో 10%కి పైగా, 53 జిల్లాల్లో 5-10% మధ్య పాజిటివిటీ రేటు ఉన్నట్టు పేర్కొంది. , పాజిటివిటీ రేటు పెరుగుతున్న 10 రాష్ట్రాల్లోని పరిస్థితులపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ శనివారం సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అస్సాం, మిజోరం, మేఘాలయ, మణిపుర్‌లలో పరిస్థితులపై విపులంగా చర్చించారు. ఈ సమావేశంలో ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ, జాతీయ ఆరోగ్య మిషన్‌ డైరెక్టర్‌, రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అలసత్వం కారణంగా గత వారం రోజుల నుంచి రోజుకు 40 వేలకు పైగా కేసులు నమోదవుతున్నట్టు గుర్తు చేశారు. పరీక్షల సంఖ్య పెంచాలని, జిల్లాస్థాయిలో పరిస్థితులను తెలుసుకొనేందుకు స్థానికంగా సీరో సర్వే నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించారు. కొవిడ్‌ మరణాల్లో 80% 45 ఏళ్లు పైబడిన వారే ఉంటున్నారని, ఆ వర్గాలకు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్నారు. అనవసర ప్రయాణాలు, గుంపులుగా గుమిగూడటాన్ని తక్షణం నియంత్రించాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించేందుకు ఇన్సాకాగ్‌ లేబొరేటరీ నెట్‌వర్క్‌ను ఉపయోగించాలని తెలిపారు. రాష్ట్రాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచనలు 10 శాతానికి మించి పాజిటివిటీ రేటు నమోదవుతున్న జిల్లాల్లో ప్రజల కదలికలపై కఠిన ఆంక్షలు విధించాలి. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదు. ఈ జిల్లాలో హోం ఐసోలేషన్‌లో ఉన్న 80 శాతం కొవిడ్‌ రోగులపై సూక్ష్మ నిఘా ఉంచాలి. వారు బయట తిరుగుతూ, ఇరుగు పొరుగు వారితో మాట్లాడకుండా చూడాలి. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆసుపత్రి సేవలు అవసరమైతే వేగంగా తరలించి వైద్యసేవలు అందించాలి. పాజిటివిటీ రేటు 10% లోపు ఉన్న జిల్లాలపైనా దృష్టి సారించి, ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించడానికి పూర్తిస్థాయిలో అందరికీ వ్యాక్సిన్‌ అందించే చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 15 రోజుల ముందే వ్యాక్సిన్‌ సరఫరా వివరాలు వెల్లడిస్తున్నందున అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయాలి. ఇప్పటికే ఇలాంటి ఆదేశాలు ఇస్తే.. ఆ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో సమీక్షించి, తక్షణం ప్రారంభమయ్యేలా చూడాలి. ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కేసుల మ్యాపింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ఆధారంగా కంటెయిన్‌మెంట్‌ జోన్లను అమలు చేయాలి. గ్రామాల్లో వైద్య సౌకర్యాలను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం మరణాల లెక్కలను ప్రకటించాలి.


By August 01, 2021 at 06:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-wants-stricter-containment-in-10-states-with-high-covid-positivity/articleshow/84937948.cms

No comments