Karnataka CM యడ్డీ జీవితంలో ఆదివారం అత్యంత కీలకం.. రాజకీయ ప్రస్థానానికి చివరి రోజు!
కర్ణాటక ముఖ్యమంత్రిగా నాలుగోసారి 2019 జులై 26న ప్రమాణం చేసిన ప్రయాణానికి త్వరలో శుభంకార్డు పడుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయన రాజీనామాపై వదంతులు వ్యాపిస్తున్న వేళ.. నాయకత్వ మార్పుపై గురువారం కీలక ప్రకటన చేశారు. అధిష్ఠానం నుంచి ఆదివారం అందే సూచనపైనే నా భవిష్యత్తు ఆధారపడుతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో యడియూరప్ప జీవితంలో ఆదివారం అత్యంత కీలకంగా మారింది. ఆయన అంచనా ప్రకారం రాజీనామాపై అధిష్ఠానం ఆదివారమే స్పష్టత ఇవ్వనుంది. రాజీనామా చేయాలని అధిష్ఠానం సూచిస్తే సోమవారం నిర్వహించే సర్కారు రెండేళ్ల విజయోత్సవ కార్యక్రమంలో దీనిపై ప్రకటన చేసేందుకు సీఎం యడియూరప్ప సిద్ధమవుతారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 17 మంది ఎమ్మెల్యేల అండతో అధికారాన్ని చేపట్టినా వారే బీజేపీ కంట్లో నలుసుగా మారారు. వీరికి పదవులు కట్టబెట్టడంతో సహజంగానే పార్టీ విధేయులకు యడ్డీ దూరమయ్యారు. ముందు నుంచి పార్టీలో ఉన్నవారికి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కలేదు. దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురువేసి చివరకు యడ్డీ పీఠానికే ఎసరుపెట్టారు. తన అండదండలు, సహకారంతో ఎదిగిన వారు ఆయనకు బద్ద విరోధులుగా మారారు. కుమారుడు విజయేంద్ర అక్రమాలను అడ్డుకోలేని ముఖ్యమంత్రితో సర్కారుకు తలవంపులు తప్పవని అధిష్ఠానం వద్ద పదేపదే ఫిర్యాదు చేస్తూ చివరకు అన్నంత పని చేశారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి యడియూరప్ప వయసు 76 ఏళ్లు. బీజేపీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు దాటితే ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం కావాలి. రాష్ట్రంలో బీజేపీకి ప్రగతికి మార్గదర్శకుడైన యడియూరప్ప విషయంలో ఆ నిబంధనలను పక్కనబెట్టారు. ఆ గౌరవంతోనే రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించింది. సరిగ్గా ఇదే అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి తాను అధిష్ఠాన నిర్ణయాన్ని గౌరవించి.. సూచనలను పాటిస్తానని ఇటీవల ప్రకటించారు.
By July 25, 2021 at 10:56AM
No comments