Breaking News

అటు చూస్తే కుక్కలు.. ఆ లోపల పరిస్థితి మరీ ఘోరం! రాజమౌళి సంచలన వ్యాఖ్యలు


దర్శక ధీరుడు ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్న పరిస్థితులు చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో కూడా కనీస వసతులు లేకపోవడంపై తన అసంతృత్తి తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన ఆయన ఇలాంటి పరిస్థితులు విదేశీయులు చూస్తే వాళ్లకు మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాను అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నానని, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల కోసం అవసరమైన కొన్ని పత్రాలు ఇచ్చి వాటిలో తగిన సమాచారాన్ని రాసి ఇవ్వమని అక్కడి సిబ్బంది చెప్పడంతో ఆ పత్రాలు నింపడం కోసం కొంతమంది ప్రయాణికులు అవస్థలు పడటం చూశానని రాజమౌళి తెలిపారు. ఫామ్స్ నింపేందుకు అనువుగా టేబుల్స్ లాంటి కనీస వసతులు కూడా లేవని, కొందరు ప్రయాణికులు గోడలకు ఆనుకుని.. మరి కొందరు నేలపైనే కూర్చొని వాటిని పూర్తి చేసి ఇచ్చారని అన్నారు. అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని తెలపడమే గాక, ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చే ద్వారం వద్ద ఉన్న వీధి కుక్కల ప్రస్తావన తీసుకొచ్చారు జక్కన్న. 'ఓ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటివి చూస్తే విదేశీయులకు మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి ఇకనైనా వీటిపై దృష్టి సారించండి' అని రాజమౌళి ట్వీట్‌ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ చూసి నెటిజన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మీలాంటి సెలబ్రిటీస్ ఇలాంటి విషయాలపై నోరు విప్పితే కొంతైనా కదలిక కనిపిస్తుందని పేర్కొంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు దీనిపై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది కూడా స్పందించడం విశేషం. 'బాహుబలి' సినిమాతో ఇండియన్ సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన రాజమౌళి ప్రస్తుతం మరో బిగ్గెస్ట్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


By July 02, 2021 at 01:59PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/s-s-rajamouli-shocking-comments-on-delhi-airport-environment/articleshow/84061203.cms

No comments