Breaking News

AIADMKలో చేరేందుకు శశికళ పావులు.. అడ్డుకునే ప్రయత్నాల్లో మాజీ సీఎం


పార్టీ పగ్గాలను చేజిక్కించుకోడానికి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వ్యూహాత్మకంగా మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో జరిపిన ఫోన్ సంభాషణల ఆడియోలను వరుసగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే డిప్యూటీ సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి పార్టీలోని పలువురు నేతలు, జిల్లా శాఖల నాయకులతో గురువారం ఆకస్మికంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీలో చేరేందుకు శశికళ చేస్తున్న కుటిల ప్రయత్నాలను అడ్డుకోవాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. శశికళ రోజూ వెలువరిస్తున్న ఆడియోలపై ప్రధానంగా వీరంతా చర్చలు జరిపారు. శశికళతో ఫోన్‌లో సంభాషిస్తున్న పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలపై పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా శాఖ కార్యదర్శుల అభిప్రాయాలను ఎడిప్పాడి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో త్వరలో తొమ్మిది జిల్లాల్లో జరుగ నున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు గురించి కూడా సమగ్రంగా చర్చించారు. ఇదిలా ఉండగా, శశికళ మరో రెండు ఆడియోలను విడుదల చేశారు. ఎంజీఆర్‌ మృతి చెందినప్పుడు అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిందని, ఆ సమయంలో ఆయన సతీమణి జానకీ రామచంద్రన్ వర్గం ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని జయకు తానే సలహా ఇచ్చానని శశికళ చెప్పడం ఓ ఆడియోలో ఉంది. అలాగే, అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే కదిర్‌గాము తదితరులతో ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ.. అన్నాడీఎంకేలో ప్రస్తుతం ఏర్పడిన విబేధాలు అన్నదమ్ముల మధ్య జరిగే వివాదాల వంటివని అన్నారు. తాను జైలుకు వెళ్లే సమయంలో ఎమ్మెల్యేలెవరిపై అనర్హత వేటు వేయవద్దని మూడు మాసాల్లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దుతానని ఎడప్పాడి, పన్నీర్‌సెల్వంకు సలహా ఇచ్చానన్నారు. అయితే ఊహించని విధంగా 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేశారని శశికళ తెలిపారు. ఈ కారణం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి రావాల్సిన అన్నాడీఎంకే ఓటమిపాలైందన్నారు. పార్టీశ్రేణులంతా నాయకులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారిని ప్రత్యక్షంగా కలుసుకోవడమే తన ప్రధాన కర్తవ్యమని తెలిపారు.


By July 02, 2021 at 12:25PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/vk-sasikala-trying-to-re-entry-into-aiadmk-and-cadre-confused/articleshow/84059331.cms

No comments