Breaking News

‘నేను కల్కిని.. గ్రాట్యుటీ ఇవ్వకపోతే కరువు తీసుకొస్తా’: మాజీ అధికారి బెదిరింపు లేఖ!


తాను కల్కి అవతారమని, తనకు రావాల్సిన గ్రాట్యుటీ వెంటనే చెల్లించాలని, లేకపోతే కరువును తీసుకొస్తానని బెదిరిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఓ మాజీ అధికారి లేఖ రాశారు. శ్రీమహావిష్ణువు పదో అవతారం ‘కల్కి’నని, తనకు దివ్య శక్తులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నాడు. గుజరాత్ జలవనరుల శాఖ‌లో ఎస్‌ఈగా పనిచేసిన రమేశ్‌చంద్ర ఫేఫార్.. స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. విధులకు తరుచూ గైర్హాజరు కావడంతో వీఆర్‌ఎస్‌కు అనుమతించారు. ఎనిమిది నెలల్లో అతడు కేవలం 16 రోజులు మాత్రమే విధులకు హాజరుకావడం గమనార్హం. పదవీవిరమణ చేసిన రమేశ్‌చంద్ర.. తనకు రావాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదని, వాటి రాకుండా ప్రిన్సిపల్ సెక్రెటరీ అడ్డుకుంటున్నారని జులై 1న రాసిన లేఖలో ఆరోపించారు. ‘ప్రభుత్వంలో ఉన్న రాక్షసుడు రూ.16 లక్షల గ్రాట్యుటీ, మరో రూ.16 లక్షలు ఏడాది వేతనం నిలిపివేశాడు’అని పరుష పదజాలం ఉపయోగించాడు. నర్మాద నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పునరావాస విభాగంలో సూపరింటిండెంట్ ఇంజినీరింగ్‌‌గా పనిచేసిన రమేశ్‌చంద్ర.. 2018లో విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం వల్ల షోకాజ్ నోటీసు అందుకున్నారు. ‘ విధులకు రాకుండానే తనకు వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు.. వర్షాలు తనవల్లే పడుతున్నాయని, తాను కల్కి అవతారమని అంటున్నాడు’ జలవనరుల విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంకే జాదవ్ తెలిపారు. ‘వెర్రితనంతో అతడు రాసిన లేఖ అందింది.. గ్రాట్యుటీ ప్రాసెస్ జరుగుతోంది.. అతడి మానసిక పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో ఎటువంటి విచారణ లేకుండా ప్రభుత్వం వీఆర్ఎస్‌కు అనుమతించింది’ అన్నారు. తన అనుగ్రహం వల్లే దేశంలో గత రెండు దశాబ్దాల నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని రమేశ్‌చంద్ర చెప్పుకున్నాడు. ‘దేశంలో ఒక్క ఏడాది కూడా కరువు లేదు... గత 20 ఏళ్లలో వర్షాలు అనుకూలించడంతో దేశానికి రూ.20 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది.. ప్రభుత్వంలో ఉన్న ఈ రాక్షసుడు నన్ను వేధిస్తున్నాడు..ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన కరువును తీసుకురాబోతున్నాను.. అందుకు కారణం నేను విష్ణువు పదో అవతారం.. నేను భూమిపై సత్యయుగంలో పాలిస్తాను’అని రమేశ్‌చంద్ర తన లేఖలో రాశాడు.


By July 05, 2021 at 10:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/former-gujarat-employee-claimed-to-be-the-kalki-avatar-and-warns-principal-secretary/articleshow/84133166.cms

No comments