చంద్రుడి ఊగిసలాటతో తీర ప్రాంతాల్లో భారీ వరదలు.. హెచ్చరించిన నాసా శాస్త్రవేత్తలు
చంద్రుడిలో ‘చలనం’ పెరగడం, వాతావరణ మార్పుల వల్ల 2030 మధ్యలో తీర ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించవచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) పరిశోధకులు హెచ్చరించారు. సాధారణంగానే చంద్రుడు తన కక్ష్యలో ‘చలనానికి’కు గురవుతాడు. దీనిని 18వ శతాబ్దంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఊగిసలాట ఒక కాలచక్రంలా మొత్తం 18.6 సంవత్సరాల పాటు సాగుతుంది. సాధారణంగా సముద్రపు అలలపై చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఉంటుంది. వీటి వల్ల అటుపోట్లు ఏర్పడతాయి. చంద్రుడి కాలచక్రం మధ్యలో ఉన్నప్పుడు భూమిపై సాధారణంగా వచ్చే అలలు తక్కువగా ఉంటాయి. ఆ సమయంలో సముద్రంలో ఆటు తక్కువగా, పోటు ఎక్కువగా ఉంటుంది. ఈ దశ దాటిన తర్వాత పరిస్థితి తారుమారై ఆటు ఎక్కువ, పోటు తక్కువవుతుంది. అయితే, 2030 మధ్యలో చంద్రుడు కాలచక్రంలో ఉద్ధృత దశలో ఉంటాడని, అప్పుడు వాతావరణ మార్పులతో సముద్రమట్టాలు పెరుగుతాయని అధ్యయన బృందానికి నాయకత్వం వహించిన నాసా శాస్త్రవేత్త బెన్ హామ్లింగ్‌టన్ చెప్పారు. దీనివల్ల ముప్పు పొంచి ఉందని, తత్ఫలితంగా అమెరికాలోని విరుచుకుపడొచ్చని ఆయన హెచ్చరించారు. కేవలం అమెరికా తీర ప్రాంతాలపైనే అధ్యయనం జరిపినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతాలన్నింటికీ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వాలు, నగర ప్రణాళిక కర్తలు సన్నద్ధం కావాలని సూచించారు. ఈ అధ్యయన ఫలితాలను నేచురల్ క్లైమేట్ ఛేంజ్‌లో జర్నల్‌లో ప్రచురించారు. ‘చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి, పెరుగుతున్న సముద్ర మట్టాలు, వాతావరణ మార్పుల కలయిక తీరప్రాంతాల్లో వరదలను పెంచుతుంది. నాసా బృందం కీలకమైన సమాచారాన్ని అందిస్తోంది.. తద్వారా వరదల వల్ల పర్యావరణానికి, ప్రజల జీవనోపాధికి ఏర్పడే నష్టాన్ని నివారించే ప్రయత్నాలను ప్రారంభించవచ్చు’ అని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ అన్నారు. అంతేకాదు, చంద్రుడిలో ఈ చలనాలు కొత్తకాదని, ప్రమాదకర ఈ విషయాన్ని తొలిసారిగా 1728లోనే గుర్తించారని వివరించారు. తుఫానుతో పోలిస్తే అలల వల్ల ఏర్పడే వరదలు చిన్న సమస్యగా చూసే ధోరణి ఉందని అధ్యయనవేత్త, హవాయి యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫిల్ థాంప్సన్ అన్నారు. ‘కానీ ఒకవేళ నెలకు 10 నుంచి 15 సార్లు వరదలు సంభవిస్తే వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోతాయి.. ప్రజల తమ ఉపాధిని కోల్పోతారు.. అలాగే, ప్రజారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఇక, అమెరికాలోని చాలా తీర ప్రాంత నగరాల్లో అలల వల్ల వరదలు సంభవించిన దాఖలాలు ఉన్నాయి. నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. 2019లో అటువంటివి 600 వరకు వరదలు సంభవించాయి.
By July 18, 2021 at 12:14PM
No comments