Breaking News

టాయ్‌లెట్ సహా ఆ అధికారి ఇల్లంతా బంగారమే.. పోలీసులకే కళ్లు బైర్లు కమ్మాయి!


రష్యాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇందులో 35 మందికిపైగా ట్రాఫిక్ పోలీసుల కీలక పాత్ర పోషించినట్టు అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణం దర్యాప్తులో కల్నల్ అలెక్సీ సఫోనోవ్ అనే ఉన్నతాధికారి ఇంటిలో సోదాలు నిర్వహించిన అధికారులు అక్కడ దృశ్యాలు చూసి కళ్లు బైర్లు కమ్మాయి. ఆయన ఇల్లంతా బంగారంతో నిండిపోయింది. ఆ ఇంట్లోని వస్తువులన్నీ బంగారంతో తయారుచేసినవే కావడంతో అవాక్కయ్యారు. బెడ్రూమ్‌, హాలు, కిచెన్‌లోని పలు వస్తువులతోపాటు.. టాయ్‌లెట్ కూడా ఆ అధికారి బంగారంతో కట్టించుకున్నాడు. అంతేకాదు దానికి మ్యాచింగ్‌గా ఫ్లోర్ను కూడా ప్రత్యేక మార్బుల్తో వేయించాడు. నైరుతి రష్యాలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న స్టావ్రోపోల్లో భూతల స్వర్గాన్ని తలపించే ఆ ఇంటి ముందు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయి. అందులోని ఫర్నీచర్, గోడకు ఉండే ఫ్రేమ్లు, కుర్చీలు, కిచెన్లో ఉండే అలమరాలు, ఇతర సామాగ్రి అంతా బంగారంతో మెరిసిపోతున్నాయి. ఇంటీరియర్ డెకరేషన్ అంతా పసిడితోనే చేయడం గమనార్హం. దర్యాప్తు బృందం ఆ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను జులై 20న ఆప్లోడ్ చేయగా.. ఇప్పటివరకు 4.37 లక్షల మందికిపైగా వీక్షించారు. కల్నల్ అలెక్సీ, అతడి కింద ఉండే ఆరుగురు అధికారులు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని వాహనాలకు ఫేక్ పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల స్టావ్రోపోల్లో ఎలాంటి రుసుము చెల్లించకుండా వాహనాలతో సరుకు రవాణా చేయవచ్చు. ఈ క్రమంలోనే వారు భారీగా అవినీతికి తెరతీసినట్టు కేసు నమోదు కాగా.. ఇందులో మరో 35 మంది హస్తం ఉందనే అనుమానులు ఉన్నాయి. ఈ క్రమంలో సోదాలకు వెళ్లిన దర్యాప్తు అధికారులు.. ఆ ఇంటిని చూసి షాక్ తిన్నారు. ఈ కేసులో 80 చోట్ల సోదాలు నిర్వహించారు. అలెగ్జాండర్ అర్జ‌నుఖిన్ అనే అధికారి సహా మరి కొందర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణలు రుజువైతే అలెక్సీకి సుమారు 15ఏళ్ల జైలు శిక్ష పడుతుందని స్థానిక మీడియోలో కథనాలు వెలువడ్డాయి. ప్రొ-క్రెమ్లిన్ యునైటెడ్ రష్యా పార్టీ ఎంపీ అలెగ్జాండర్ ఖిన్‌స్టేన్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో 35 మందికి పైగా ట్రాఫిక్ పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ‘స్టావ్రోపోల్‌లో కరుడగట్టిన మాఫియా రాజ్యమేలుతోంది.. బ్లాక్ మార్కెట్ నంబర్ ప్లేట్లు, సరుకు రవాణా నుంచి ఇసుక పంపిణీ వరకు ప్రతిదాని నుంచి లాభం పొందుతోంది’ అని ఆరోపించారు.


By July 26, 2021 at 07:21AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/golden-toilet-steals-the-show-during-bribery-probe-in-russian-col-alexei-safonov-lavish-mansion/articleshow/84746577.cms

No comments