Breaking News

శివసేన మా శత్రువు కాదు.. ఏదైనా జరగొచ్చు.. ప్లేటు ఫిరాయించిన మాజీ సీఎం!


శివసేన‌పై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో ముందుండే ఫడ్నవీస్‌.. హఠాత్తుగా ప్లేటు ఫిరాయించడం చర్చనీయాంశమవుతోంది. శివసేన ఎప్పటికీ తమ శత్రువు కాదని.. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బీజేపీ-శివసేన మళ్లీ కలిసే అవకాశం ఉందా..? అని అడిగితే.. పరిస్థితులను బట్టి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘శివసేన ఎప్పటికీ మా శత్రువు కాదు.. వారు మా మిత్రులే. అయితే, సేన నేతలు ఎవరికి వ్యతిరేకంగా పోరాడారో.. వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.. మా స్నేహాన్ని వదిలేశారు.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు... పరిస్థితులను బట్టి నిర్ణయాలు మారుతుంటాయి ’’ అని ఫడణవీస్‌ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతిపక్ష బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని కూటమి దుయ్యబడుతోంది. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఈడీ, సీబీఐ కేసులు నమోదుచేయడం బీజేపీ ప్రయత్నాల్లో భాగమేనని శివసేన, ఎన్సీపీ మండిపడుతున్నాయి. అయితే, ఇటీవల కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు.. వాటికి సీఎం ఉద్ధవ్, శివసేన ఘాటుగా స్పందించడం వంటి పరిణామాలతో కూటమిలో లుకలుకలు మొదలయ్యాయని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్.. ఐదేళ్లూ ఉద్ధవ్ సీఎంగా ఉంటారని స్పష్టం చేసింది. ఇందులో ఎటువంటి సందేహం లేదని పేర్కొంది. గతవారం ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మధ్య భేటీ జరిగింది. అదే రోజు పలువురు నేతలు, క్యాబినెట్ మంత్రులు జితేంద్ర అవద్, హోం మంత్రి దిలీప్ పాటిల్, ఆదిత్య ఠాక్రేలు మరోవైపు సమావేశమయ్యారు. గత నెలలో ఢిల్లీకి వెళ్లిన సీఎం ఉద్ధవ్.. ప్రధాని నరేంద్ర మోదీతో ఏకాంతంగా భేటీ కావడం పలు ఊహాగానాలకు తెరలేచింది. అయితే, ఇది రాజకీయ సమావేశం కాదని శివసేన వివరణ ఇచ్చింది.


By July 05, 2021 at 11:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/shiv-sena-was-never-our-enemy-say-former-cm-devendra-fadnavis-on-renewal-of-ties/articleshow/84134142.cms

No comments