Breaking News

ఓ శకం ముగిసింది.. దిలీప్ కుమార్ మృతిపై ప్రధాని మోడీ, మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్


బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ (98) ఈ రోజు (బుధవారం) ఉదయం కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు సినీ లోకాన్ని ఏలిన ఆయన, ట్రాజెడీ కింగ్‌గా పేరు ప్రఖ్యాతలు గడించారు. దిలీప్ కుమార్ మరణ వార్తతో సినీ లోకంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్వట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలుపుతూ.. దిలీప్ కుమార్ మరణం మన సాంస్కృతిక జగత్తుకు తీరని లోటని పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో లెజెండ్‌గా దిలీప్‌కుమార్‌ ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతారని, ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు. భారత సినీ రంగానికి దిలీప్ కుమార్ చేసిన సేవలను ముందు తరాలు కూడా గుర్తుంచుకుంటాయని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దిలీప్ కుమార్ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలుపుతూ ట్వీట్స్ చేశారు. దిలీప్ కుమార్ ఇకలేరని తెలిసి బాలీవుడ్ సహా టాలీవుడ్ నటీనటులంతా ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ''భారతదేశం గర్వించదగిన నటుల్లో ఒకరైన దిలీప్‌కుమార్‌ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. కొన్నేళ్లపాటు తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న లెజెండ్‌ మృతి బాధకరం. ఆయన మరణంతో ఒక శకం ముగిసింది. దిలీప్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'' అన్నారు. ''ఇండియన్ సినిమాలో దిలీప్ కుమార్ మార్క్ ప్రత్యేకమైంది. ఆయనను తరతరాలు గుర్తుంచుకుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా'' అని మోహన్ లాల్ ట్వీట్ పెట్టారు. ''భారతీయ సినీ పరిశ్రమ విలువను పెంచిన దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను'' అని ఎన్టీఆర్‌ అన్నారు.


By July 07, 2021 at 10:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/celebrities-deep-condolence-on-dilip-kumar-death/articleshow/84195346.cms

No comments