తెరుచుకున్న శబరిమల ద్వారాలు.. రెండో దశ వ్యాప్తి తర్వాత తొలిసారి భక్తులకు అనుమతి
శబరిమల మాస పూజల కోసం శుక్రవారం సాయంత్రం తెరిచారు. శనివారం ఉదయం నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం దర్శనాలు ప్రారంభమయ్యాయి. జులై 21 వరకు ఐదు రోజుల పాటు ఆలయంలోకి భక్తులను దర్శనం కోసం అనుమతిస్తారు. కోవిడ్ నేపథ్యంలో కేవలం 5 వేల మందికి మాత్రమే అనుమతిస్తున్నట్టు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. కోవిడ్ టీకా రెండు డోస్‌లు వేసుకున్నవారు, ఆర్‌టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టంచేసింది. దర్శనానికి వచ్చే 48 నుంచి 72 గంటల ముందు చేయించుకున్న పరీక్షను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ముందుగా ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని.. 5 వేల మందికి మాత్రమే దర్శన అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. కోవిడ్ రెండో దశ విజృంభణ తర్వాత మొదటిసారిగా అయ్యప్ప ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. తొలి దశ వ్యాప్తి తర్వాత మండల, మకరు విలక్కు పూజలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. రెండో దశ వ్యాప్తి మొదలు కావడంతో తిరిగి మే నుంచి భక్తుల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం నిషేధం విధించింది. మూడు నెలల అనంతరం ఆంక్షలు సడలించి మళ్లీ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న శబరిమల అయ్యప్ప ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. మండల, మకరవిళక్కు పూజల కాలంలో లక్షలాది మంది దర్శించుకుంటారు. కానీ, కరోనా కారణంగా గతేడాది నుంచి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. జులై 17న సాయంత్రం ఆలయాన్ని తెరిచి, ప్రత్యేక పూజల అనంతరం దర్శనానికి అనుమతిస్తారు. కోవిడ్ తొలినాళ్లలో కరోనాను సమర్ధవంతంగా కట్టడిచేసిన కేరళ.. రెండో దశలో మాత్రం నియంత్రణలో విఫలమయ్యింది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. అన్ని సేవలను ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు.
By July 17, 2021 at 08:57AM
No comments