విదిశ విషాదం.. బాలుడ్ని రక్షించడానికి వెళ్లిన 11 మంది మింగేసిన బావి
ఓ బాలుడ్ని రక్షించడానికి వెళ్లి, రక్షణ గోడ కూలిపోవడంతో ప్రమాదవశాత్తు 30 మంది బావిలో పడిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పెను విషాదానికి కారణమయ్యింది. మొత్తం 11 మంది మృతిచెందారు. విదిశ జిల్లా గంజ్‌బసోడ సమీపంలోని పటార్ గ్రామంలో ఓ బాలుడి బావిలో పడిపోగా.. అతడిని రక్షించేందుకు గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో రక్షణ గోడ కూలిపోవడంతో 30 మంది బావిలో పడిపోయారు. వీరిలో 19 మందిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు రక్షించగా.. 11 మంది చనిపోయారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తక్షణమే సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కూడా స్పందించి.. మంత్రి విశ్వాస్ సారంగ్‌ను ఘటనాస్థలికి పంపారు. కలెక్టర్, ఎస్పీలు ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని.. కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు. ‘మధ్యప్రదేశ్‌లోని విదిశలో జరిగిన విషాదం తీవ్ర విచారకరం.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం అందజేయనున్నాం’ అని ప్రధాని ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతకు ముందు, ఈ విషాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పందించారు. కలెక్టర్, ఎస్పీలు ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. ‘ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.. ఆ జోన్ ఐజీ, ఇతర ఉన్నతాధికారులు కూడా అక్కడకు చేరుకున్నారు... సంబంధిత అధికారులతో టచ్‌లో ఉన్నాం’అని తెలిపారు. ప్రమాదంపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.50వేలు చొప్పు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రి ఓ బాలుడు బావిలో పడిపోవడంతో అతడ్ని కాపాడటానికి కొందరు అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో బావి రక్షణ గోడ కూలిపోయింది.
By July 17, 2021 at 08:25AM
No comments