‘హిందూ ముస్లిం వేర్వేరు కాదు.. డీఎన్ఏ ఒక్కటే’ ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
భారతీయులందరి డీఎన్‌ఏ ఒక్కటేనని, ఇస్లాం ప్రమాదంలో ఉందనే భయం వలయంలో ముస్లింలు చిక్కుకోవద్దని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కోరారు. ‘హిందుస్థానీ ఫస్ట్, హిందుస్థాన్ ఫస్ట్’ అనే అంశంపై ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మూకదాడులకు పాల్పడేవారు హిందుత్వానికి వ్యతిరేకులని, పలుచోట్ల అమాయకులపైనా మూకదాడి కేసులు బనాయించారని పేర్కొన్నారు. దేశంలో ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని భగవత్ నొక్కిచెప్పారు. జాతీయవాదం, పూర్వీకుల కీర్తి ఐక్యతకు ఆధారమని ఆయన స్పష్టం చేశారు. ‘హిందూ-ముస్లింల ఐక్యత భిన్నంగా లేదు.. కానీ మతంతో సంబంధం లేకుండా భారతీయులందరి డిఎన్‌ఎ ఒకేలా ఉంటుంది.. మనది ప్రజాస్వామ్యం.. హిందువులు లేదా ముస్లింలు అనే అధిపత్యం ఉండకూడదు.. కేవలం భారతీయులనే ఆధిపత్యం ఉండాలి’ అని భగవత్ వ్యాఖ్యానించారు. గొప్ప పేరు పొందాలని లేదా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడాలని ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తన ప్రసంగం ప్రారంభంలో చెప్పడం కొసమెరుపు. సంఘ్ పరివార్ రాజకీయాల్లో లేదని, ఇమేజ్‌ను నిలబెట్టుకోవడం గురించి బాధపడటం లేదని భగవత్ అన్నారు. ‘దేశాన్ని బలోపేతం చేయడానికి సమాజంలోని అందరి సంక్షేమం కోసం తన పనిని చేస్తూనే ఉంటుంది’ అని ఆయన అన్నారు. ‘ఒకవేళ దేశంలో ముస్లింలకు స్థానం లేదని చెప్పే హిందువు అసలు హిందువేకాదు.. ఆవు ఎంతో పవిత్రమైన జంతువు.. కానీ ఇతరులను కించపరిచే వ్యక్తులు హిందుత్వానికి వ్యతిరేకంగా వెళుతున్నారు.. ఎటువంటి పక్షపాతం లేకుండా చట్టం వారిపై సరైన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.
By July 05, 2021 at 07:12AM
No comments