Breaking News

వీఐపీల తాకిడితో సామాన్యులకు నిరీక్షణ.. ఉజ్జయిని ఆలయంలో తొక్కిసలాట


ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిన్నారులు, మహిళలు సహా పలువురు భక్తులు గాయపడ్డారు. భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాకాళేశ్వర్ స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రముఖులతో పాటు సామాన్య భక్తులు కూడా ఒకేసారి చొచ్చుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో భక్తులు అదుపుతప్పి ఒకరిపై ఒకరు పడ్డారు. నాలుగో నెంబరు గేటు వద్ద తొక్కిసలాట జరిగినట్టు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది తక్షణమే వచ్చి పరిస్థితిని అదుపుచేశారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కరోనా వైరస్ నేపథ్యంలో మహాకాళేశ్వర్ దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సిన్ ఒక్క డోస్ లేదా ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాలి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తుండగా... రోజుకు 3,500 మంది భక్తులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. ఏడు టైమ్ స్లాట్స్‌లో ఒక్కో స్లాట్‌కు 500 మందికి టిక్కెట్లు జారీచేస్తున్నారు. సోమవారం శివరాజ్ సింగ్ చౌహన్, మాజీ సీఎం ఉమాభారతి సహ పలువురు వీఐపీలు తమ కుటుంబాలతో కలిసి దర్శనానికి వచ్చారు. వీఐపీల తాకిడితో సాధారణ భక్తులు ఇబ్బంది పడ్డారు. శ్రావణ మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనిపై ఉజ్జయిని కలెక్టర్ అశిష్ సింగ్ మాట్లాడుతూ. వచ్చే వారం నుంచి పరిస్థితి సాధారణంగా ఉంటుందన్నారు. అధికారులతో సమావేశమై వచ్చే సోమవారం దర్శనాల గురించి ఓ ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. భారీ సంఖ్యలో భక్తులను అనుమతిస్తే కోవిడ్ నిబంధనలు పాటించడం కష్టతరమవుతుందని అన్నారు. భక్తులు భౌతికదూరం పాటించకుండా కరోనా నిబంధనలు ఉల్లంఘించారని అన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించడం వంటి కోవిడ్ నిబంధనలు ఆయన పేర్కొన్నారు.


By July 27, 2021 at 10:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/stampede-amid-vip-visits-injures-many-covid-rules-broken-in-ujjain-temple/articleshow/84783025.cms

No comments