చివరి క్షణం వరకూ అమరీందర్ విశ్వప్రయత్నం.. అయినా సిద్ధూకే పీసీసీ పగ్గాలు!
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ నవజోత్‌సింగ్ సిద్ధూ నియమితులయ్యారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూకు సాయంగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. నియామక ప్రకటన వెలువడే చివరిక్షణం వరకూ సిద్ధూకు ఆ పదవి దక్కకుండా అమరీందర్ వర్గం విశ్వప్రయత్నాలు చేసింది. పంజాబ్‌లో పార్టీకి జవసత్వాలు కల్పించడంలో సీఎం అమరీందర్ కృషిని మరువొద్దంటూ 10 మంది ఎమ్మెల్యేలు ఓ ఉమ్మడి ప్రకటన కూడా చేశారు. అయితే, అమరీందర్‌కు అధిష్ఠానం నచ్చజెప్పడంతో ఆయన వెనక్కు తగ్గారు. సిద్ధూను పీపీసీ అధ్యక్షుడిగా నియమించడం వల్ల వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతూ సోనియాకు అమరీందర్ లేఖ రాశారు. అంతేకాదు, ముఖ్యమంత్రి, పీసీపీ అధ్యక్ష బాధ్యతలు ఒకే సామాజిక వర్గానికి అప్పగించడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అందులో పేర్కొన్నారు. కానీ, అధిష్ఠానం మాత్రం సిద్ధూ విషయంలో వెనక్కు తగ్గలేదు. ఆయనే పీసీపీ అధ్యక్షుడిగా ఉంటారని అమరీందర్‌కు స్పష్టం చేసింది. పీసీపీ అధ్యక్షుడిగా .. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సంగత్ సింగ్ గిల్‌జియాన్, సుఖ్వీందర్ సింగ్ దాన్నీ, కుల్‌జీత్ నాగ్రా, పవన్ గోయల్‌ను నియమించింది. అసమ్మతి ఎమ్మెల్యేల్లో ఒకరైన గిల్‌జియాన్.. సీఎం అమరీందర్‌పై తరుచూ విమర్శలు గుప్పిస్తున్నారు. దళితుల కోసం సీఎం చేసింది ఏమీలేదని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీఎం మద్దతుదారుల్లో దాన్నీ, రాహుల్ సన్నిహితుడు నాగ్రాకు కార్యనిర్వాహక వర్గంలో చోటు దక్కింది. కాగా, సిద్ధూ నియామకాన్ని విపక్ష శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) ఎద్దేవా చేసింది. ముఖ్యమంత్రిగా అమరీందర్, మంత్రిగా సిద్ధూ ఘోరంగా విఫలమయ్యారని, దాన్ని కప్పిపుచ్చేందుకే కాంగ్రెస్ కొత్త నాటకాలకు తెరతీసిందని విమర్శించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నవజోత్ సింగ్ సిద్ధూ.. అమరీందర్ మంత్రివర్గంలో కొన్నాళ్లు ఉన్నారు. అయితే, అమరీందర్‌తో విబేధించి రెండేళ్ల తర్వాత పదవికి రాజీనామా చేశారు.
By July 19, 2021 at 08:35AM
No comments