కర్ణాటకలో ఊహించిందే జరిగింది.. రాజీనామాపై యడ్డీ ప్రకటన
ఎట్టకేలకు తన రాజీనామాపై కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ఆయన.. మధ్యాహ్నం గవర్నర్‌ను కలుస్తానని తెలిపారు. నాలుగోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్ల పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల పాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపానని చెప్పారు. అయితే, తనకు ఈ రెండూళ్లూ అగ్ని పరీక్షలా నడిచిందని భావోద్వేగానికి గురయ్యారు. ‘మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తనను కేంద్ర మంత్రివర్గంలో చేరాలని కోరారు.. కానీ, నేను కర్ణాటకలో ఉంటానని చెప్పాను’ అని నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. ‘ రెండేళ్లూ ప్రతిక్షణం అగ్నిపరీక్షే. కొవిడ్ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా... అయినా పాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా ముందుకు నడిపా... ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మాజీ ప్రధాని వాజ్‌పేయీ కేంద్రంలో మంత్రిపదవి ఇస్తానని చెప్పారు. కానీ నేను కర్ణాటకలోనే ఉంటానని ఆయనకు చెప్పా. ఈ ప్రజలకు నేను ఎంతగానో రుణపడి ఉన్నా’’ అని యడ్డీ కన్నీళ్లుపెట్టుకున్నారు. కర్ణాటకలో ఎదుగుదలకు యడియూరప్ప చేసిన కృషి మరువలేనిది.. వాస్తవానికి యడ్డీ రాజీనామా అంశంపై బీజేపీ అధిష్ఠానం ఆదివారమే స్పష్టతనిస్తుందని భావించినా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. సమన్వయం లేని జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిన వెంటనే మొదలైన యడియూరప్ప నాయకత్వంలోని బీజేపీ సర్కారు రెండేళ్లుగా ఆటుపోట్లతో ఊగిసలాడుతోంది. ఈ రెండేళ్లలో సర్కారు పయనం ఏమంత సజావుగా సాగలేదు. 2008 నుంచి 2013 వరకు ఐదేళ్ల పాటు బీజేపీ పాలించినా వివిధ కారణాలతో మూడుసార్లు నాయకత్వాన్ని మార్చాల్సి వచ్చింది. 2018లోనూ అత్యధిక స్థానాలు పొందినా అధికారానికి సరిపడా సంఖ్యాబలం లేక.. కేవలం ఆరు రోజులకే చతికిల పడింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 100కుపైగా సీట్లు గెలుపొందిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ 80 స్థానాలతో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్.. 37 సీట్లు గెలుపొందిన జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కమలం పార్టీకి అధికారం దక్కొద్దనే ఉద్దేశంతో.. కుమారస్వామిని సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. కానీ కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో.. బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. కానీ సీఎం పగ్గాలు చేపట్టిన ఆనందం ఆయనకు ఎంతో కాలం నిలవలేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలో.. కరోనా దేశంలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఆయన కరోనా కట్టడిపైనే ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఈ విషయమై యడియూరప్ప మాట్లాడుతూ.. తానెప్పుడూ అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. కాగా యడియూరప్ప హయాంలో భూకుంభకోనాలు, గనులు కుంభకోణాలు, కరోనా స్కామ్‌లు, ఆపరేషన్ కమలం, వీడియో సీడీలు.. తదితరాలు చోటు చేసుకున్నాయని.. యడియూరప్ప ఫైనల్‌గా సీఎం పదవికి రాజీనామా చేస్తున్నారని.. ఆయన స్థానంలో మోదీ, షా ద్వయం డమ్మీ సీఎంను కూర్చోబెడతారని కర్ణాటక కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. యడియూరప్ప రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగానే.. ఆయన స్థానంలో పగ్గాలు చేపట్టబోయేది ఎవరనే విషయం చర్చకు దారితీసింది. ధార్వాడ్ వెస్ట్ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్, విజయపుర ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్, మంత్రి మురుగేష్ ఆర్ నిరానీ, బసవరాజ్ బొమ్మై తదితరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
By July 26, 2021 at 12:32PM
No comments