మూడుసార్లు ఎమ్మెల్యే.. పదో తరగతి పరీక్షలకు హాజరు!
అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే పదో తరగతి పరీక్షలకు హాజరయిన సన్నివేశం ఒడిశాలో చోటుచేసుకుంది. బీజేడీ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వయిన్ (49) ఆ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శుక్రవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. సురడా నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన పూర్ణచంద్ర.. స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో స్టేట్ ఓపెన్ స్కూలు సర్టిఫికేట్(ఎస్‌ఓఎస్‌సీ) కోసం పరీక్ష రాశారు. ఆయనకు స్వల్ప అస్వస్థత కారణంగా పరీక్ష కేంద్రంలోని ప్రత్యేక గదిలో రాయించారు. ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. కరోనా కారణంగా పరీక్షలు రద్దుచేసినా.. మార్కులపై సంతృప్తి చెందకపోతే పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కూడా పరీక్షకు హాజరయ్యారు. గంజాం జిల్లా సురడాలో 1972లో జన్మించిన పూర్ణచంద్ర.. అప్పటి కుటుంబ పరిస్థితుల కారణంగా తొమ్మిదో తరగతితోనే చదువును ఆపేశారు. ప్రస్తుతం మంచి మార్కులతో ఉత్తీర్ణుడు కావాలనే పరీక్షకు హాజరయినట్టు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. గతంలోనూ పూర్ణ చంద్ర పదో తరగతి పరీక్షలు రాసినా ఉత్తీర్ణులు కాలేదు. ప్రస్తుత ఏడాది కూడా పరీక్షలు రాయడానికి సిద్ధం కాగా.. కరోనా కారణంగా రద్దయ్యాయి. పరీక్షలు నిర్వహించకుండానే అందర్నీ ఉత్తీర్ణులైనట్టు దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే, తనకు వచ్చిన మార్కులపై సంతృప్తి చెందని ఎమ్మెల్యే పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల కిందట స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆయనకు ప్రత్యేక గది కేటాయించారు. కోవిడ్ నిబంధనల మధ్యే పరీక్షను రాశారు.
By July 31, 2021 at 07:44AM
No comments