స్టేడియం వద్ద కాల్పులు.. నలుగురు మృతి.. అర్ధాంతరంగా ఆట రద్దు
అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు కలకలం రేగింది. రెండు చోట్ల జరిగిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. రాజధాని వాషింగ్టన్‌లోని శనివారం బేస్‌బాల్ స్టేడియం వెలుపల దుండగులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. బేస్‌బాల్ స్టేడియంలో ఆట ప్రారంభానికి ముందు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దీంతో వాషింగ్టన్ నేషనల్స్, సాన్‌డియాగో మధ్య జరగాల్సిన ఆట రద్దయ్యింది. పోలీసులు స్టేడియం నుంచి ప్రేక్షకులను బయటకు పంపేశారు. ‘దక్షిణ వాషింగ్టన్ డీసీ నేవీ యార్డ్ పక్కనే ఉన్న జాతీయ పార్కు వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు’ అని తొలుత పోలీసులు ట్వీట్ చేశారు. ఆ వెంటనే బుల్లెట్ గాయాలైన మరో ఇద్దర్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ప్రస్తుతం ఎటువంటి ముప్పు లేదని వివరించారు. కాల్పుల శబ్దం వచ్చిన వెంటన స్టేడియంలోని ప్రేక్షకులు కొందరు బయటకు పరుగెత్తారని, మరికొందరు అనౌన్సర్ ప్రాధమిక విజ్ఞప్తి మేరకు తమ సీట్లలోనే ఉన్నారని అక్కడ ఉన్న ఇద్దరు జర్నలిస్టులు తెలిపారు. డజను లేదా అంతకంటే ఎక్కువసార్లు కాల్పుల శబ్దం వినబడటంతో ఆటను నిలిపివేసి, ఆటగాళ్లు మైదానం నుంచి డ్రస్సింగ్ రూమ్‌కు వెళ్లారని అన్నారు. కాల్పుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. మొత్తం ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తెచ్చుకుని ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బేస్ బాల్ నేషనల్ పార్క్ మూడో గేట్ వెలుపల కాల్పులు జరిగినట్టు వాషింగ్టన్ పోలీసులు తెలిపారు.
By July 18, 2021 at 01:48PM
No comments