Breaking News

మేం మాత్రమే ప్రాణాలతో.. వైరల్ అవుతున్న హిమాచల్ ఘటన వీడియో


హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో రెండు రోజుల కిందట కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఈ భయంకర ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఇద్దరు రక్తమోడుతుండగా పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ వీడియో యూట్యూబ్‌లో మంగళవారం కనిపించింది. దాదాపు ఐదు నిమిషాల నిడివిగల ఈ వీడియోను మొబైల్ ఫోన్‌తో చిత్రీకరించారు. తలకు తీవ్రగాయమైన యువకుడు తనను తాను నవీన్‌గా పేర్కొంటూ.. ఏం జరిగిందో వివరిస్తున్నాడు. ‘ప్రమాదం జరగడానికి పది నిమిషాల ముందే మా కారు అక్కడ నిలిపి ఉంచాం.. రాళ్లు బాణాల్లా దూసుకురావడంతో నుజ్జునుజ్జయ్యింది... నేను ముందు సీట్లో ఉన్నాను.. ఏదో ఒకవిధంగా బయటపడ్డాను.. నా తలకు గాయమై రక్తం కారుతోంది.. ఇది ఎంత తీవ్రమైందో తెలియదు’ అని చెప్పాడు. కారు నిలిపి ఉంచి చోట పెద్ద బండరాళ్లు, విరిగిపడిన కొమ్మలు, కంకర వంటి శిథిలాలు మాత్రమే ఉండగా.. వాహనం కనిపించలేదు. రాళ్లు దూసుకొస్తుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఓ చెట్టు కిందకు పరిగెత్తాను.. నా స్నేహితుడు, ఓ మహిళ సహ మరో ఇద్దరు అక్కడే ఉన్నారు.. ఈ సమయంలో ‘ఉండండి ... అక్కడే ఉండండి, కదలకండి.. నేను వస్తున్నాను’ అని అరిచాడు. సహాయం పోలీసులకు ఫోన్ చేయగా.. కనెక్ట్ కాలేదని తెలిపాడు. ‘చూడండి, చూడండి ... మరిన్ని రాళ్లు దూసుకొస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి’ అంటూ వీడియోలో అరుపులు వినిపిస్తున్నాయి. ఆదివారం జరిగిన భయంకర ఘటనను యువకుడు గుర్తుచేసుకున్నాడు. ఘటనలో ప్రాణాలతో బయటపడి మరో వ్యక్తి కొండపైకి ఎక్కడ వీడియోలో కనిపిస్తోంది. ముఖంపై గాయం నుంచి రక్త కారుతుండగా.. దానికి రుమాలు చుట్టాడు. పక్కనే ఒక మహిళ మృతదేహం పడి ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కిన్నౌర్ జిల్లా సంగ్లా-చిత్ కుల్ రోడ్డు వద్ద ఆదివారం కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటనలో 9 మంది మరణించిన ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. మృతుల్లో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన దీపా శర్మ(34) అనే వైద్యురాలు కూడా ఉన్నారు. దుర్ఘటన జరగడానికి సరిగ్గా 25 నిమిషాల ముందు ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. ‘‘సాధారణ ప్రజలకు అనుమతి ఉన్న భారతదేశపు చిట్టచివరి పాయింట్ వద్ద నేనిప్పుడు నిల్చొని ఉన్నా. ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో చైనా అక్రమించిన టిబెట్‌తో మనకు సరిహద్దు ఉంది’ అంటూ ట్వీట్ చేశారు దీపా శర్మ’. అయితే అదే ఆమె చివరి ట్వీట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. అంతకుముందు రోజు కొండ ప్రాంతంలో దిగిన ఫోటోను షేర్ చేసిన దీపా శర్మ ‘ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు’ అని కామెంట్ పెట్టారు.


By July 28, 2021 at 10:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/himachal-pradesh-rockslide-harrowing-footage-of-two-survivors/articleshow/84814775.cms

No comments