Breaking News

హైవేలపై మద్యం దుకాణాల తొలగింపు.. కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు


జాతీయ రహదారులకు సమీపంలో మద్యం దుకాణాల ఏర్పాటుపై గతంలో మార్గదర్శకాలను జారీచేసిన విషయం తెలిసిందే. జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో దుకాణాలను ఏర్పాటుచేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారులకు సమీపంలో ఉండే మద్యం దుకాణాల తొలగింపు అంశంపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రి పార్లమెంట్‌లో ఆసక్తికర సమాధానం ఇచ్చారు. జాతీయ రహదారుల సమీపంలో దుకాణాల తొలగింపు తన నియంత్రణలో లేదని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరించదని.. అది కేవలం రాష్ట్రాలకు చెందిన అంశమని రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు. జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మాత్రమే ఉపరితల రవాణా శాఖ జోక్యం చేసుకుంటుందని నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడం, తొలగింపులపై ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని గడ్కరీ గుర్తు చేశారు. రహదారులకు 500మీటర్ల దూరంలో ఉండేలా స్పష్టమైన ఆదేశాలున్నాయని చెప్పారు. ఒకవేళ 20 వేలు లేదా అంతకంటే తక్కువగా జనాభా ఉండే స్థానిక పంచాయతీల పరిధిలో 220 మీటర్లలోపు దుకాణం ఏర్పాటుచేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి సూచించారు. అంతేకాకుండా మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 185 ప్రకారం, తాగి వాహనం నడిపితే జరిమానా, శిక్ష ఉంటాయని ఆయన గుర్తు చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌ ప్రమాదాలపై ప్రజల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. దేశవ్యాప్తంగా 2019లో మొత్తం 4.49 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా.. మొత్తం 1,51,113 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నితిన్‌ గడ్కరీ రాజ్యసభలో వెల్లడించారు. అంతకుముందు ఏడాది (2018)తో పోలిస్తే ప్రమాదాలు, మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గాయని చెప్పారు. ముఖ్యంగా అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్‌రూట్‌లో వాహనం నడపడం, డ్రైవింగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్లు వాడడం వల్లే ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయని కేంద్రమంత్రి తెలిపారు.


By July 27, 2021 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-minister-nitin-gadkari-on-removal-of-liquor-shops-near-national-highways/articleshow/84780727.cms

No comments