Breaking News

Afghanistan బలగాల ఉపసంహరణ తప్పిదమే.. మహిళలకు నరకమే: అమెరికా మాజీ అధ్యక్షుడు


అఫ్గనిస్థాన్ నుంచి అమెరికా తన బలగాలను పూర్తి ఉప-సంహరించుకోవడంతో అక్కడ మరోసారి పేట్రేగిపోతున్నారు. ఇప్పటికే అఫ్గన్‌లోని దాదాపు 80 శాతం భూభాగాన్ని తిరిగి ఆక్రమించుకున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బలగాల ఉపసంహరణపై అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్.డబ్ల్యూ బుష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాటో (NATO) బలగాల ఉపసంహరణను ఆయన పెద్ద తప్పిదంగా అభివర్ణించారు. ఇలా చేయడం వల్ల అక్కడి సామాన్య పౌరులను తాలిబాన్లకు బలిపశువులను చేస్తున్నారని బుష్ ఆవేదన వ్యక్తం చేశారు. జర్మన్ ఇంటర్నేషన్ బ్రాడ్‌కాస్టర్ డెశ్చస్ వెల్లే‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుష్ ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గన్‌లో బలగాల ఉపసంహరణపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘అఫ్గాన్‌ మహిళలు, బాలికలు చెప్పలేనంత హానిని ఎదుర్కోబోతున్నారు. చంపడానికి వెనకాడని అత్యంత క్రూరమైన వ్యక్తుల చేతిలో వదిలివెళ్లడం కచ్చితంగా పొరపాటే. ఇది నా హృదయాన్ని ఎంతగానో కలచివేస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ కూడా ఇదేవిధమైన అభిప్రాయం కలిగివున్నారని భావిస్తున్నానని బుష్‌ పేర్కొన్నారు. ‘బలగాల ఉపసంహరణ వల్ల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఈ విషయం గురించి పునరాలోచించాలి’ అని వ్యాఖ్యానించారు. జర్మనీ ఛాన్సలర్ హోదాలో ఏంజెలా మెర్కెట్ చివరిసారిగా అమెరికాలో పర్యటించనున్న వేళ.. బుష్ ఆమె ప్రస్తావన తీసుకురావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. ‘అఫ్గన్‌లో బలగాల మోహరింపును ఆమె సమర్ధించారు.. ఎందుకంటే అఫ్గన్‌లో యువతులు, మహిళల విషయంలో జరిగిన పురోగతిని ఆమె చూశారు’ అని బుష్ పేర్కొన్నారు. ‘తాలిబన్ల క్రూరత్వం నుంచి ఆ సమాజం ఎలా బయటపడిందో నమ్మశక్యం కాదు.. పాపం అకస్మాత్తుగా అఫ్గన్ మహిళలు, బాలికలు చెప్పలేని హాని అనుభవిస్తారని నేను భయపడుతున్నాను’ అని వ్యాఖ్యానించారు. ‘లారా (బుష్ భార్య), నేను ఆఫ్ఘన్ మహిళలతో చాలా సమయం గడిపాం.. వారు భయపడుతున్నారు. అమెరికా మాత్రమే కాకుండా నాటో దళాలకు సహాయం చేసిన వ్యక్తుల గురించి నేను ఆలోచిస్తున్నాను.. క్రూరమైన వ్యక్తుల చేతుల్లో చావుకు దగ్గరవుతున్నట్టుంది.. అది నా హృదయాన్ని ద్రవింపజేస్తోంది’అని విచారం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా జార్జ్‌ డబ్ల్యూ.బుష్‌ ఉన్నప్పుడే న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌పై 2001 సెప్టెంబర్‌ 11న అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడి అనంతరం అల్‌ఖైదా, తాలిబన్‌లను సమూలంగా ఏరివేయడానికి అమెరికా, నాటో దళాలను అఫ్గానిస్థాన్‌కు పంపిచారు. రెండు దశాబ్దాలుగా సాగిన యుద్ధానికి ముగింపు పలికారు. తాలిబన్లతో శాంతి ఒప్పందం తర్వాత అఫ్గాన్‌ నుంచి తమ బలగాలు ఈ ఏడాది సెప్టెంబర్‌ 11 నాటికి పూర్తిగా ఉపసంహరించుకోవాలని అమెరికా, నాటో దేశాలు నిర్ణయించాయి. అయితే, గడువుకు ముందే జులై తొలివారం నాటికే ఈ ప్రక్రియను పూర్తిచేశాయి. అమెరికా, నాటో బలగాలు వెనుదిరగడంతో అఫ్గాన్‌లో మళ్లీ తాలిబన్ మూకలు పెచ్చుమీరుతున్నాయి. గతంలో తమ స్థావరాలుగా ఉన్న ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఓపక్క ఉగ్రవాదులు, మరోవైపు తాలిబన్ల చర్యలతో అక్కడ చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనలపై తాజాగా ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. 90 వ దశకంలో అఫ్గన్‌‌పై పట్టుసాధించిన తాలిబన్లు.. మహిళలను చిత్రహింసలకు గురిచేశారు. వారు ఇళ్ల నుంచి అడుగుపెట్టాలంటే భయపడిపోగా.. బాలికల విద్యను వ్యతిరేకించారు.


By July 15, 2021 at 07:19AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/troops-pullout-from-afghanistan-is-a-mistake-says-us-former-president-george-w-bush/articleshow/84428668.cms

No comments