Breaking News

కోవిడ్ బాధితులకు పరిహారం ఇవ్వాల్సిందే..6 వారాల్లో మార్గదర్శకాలు: కేంద్రానికి సుప్రీం ఆదేశం


కరోనాతో చనిపోయివారి కుటుంబాలకు ఆర్థిక సాయం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. ఇందుకు ఆరు వారాల్లోగా మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.‘కనీస ప్రమాణాలు గల ఆర్థిక సహాయం’ అందజేయడానికి మార్గదర్శకాలను జారీ చేయాలని బుధవారం నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(ఎన్‌డీఎంఏ)ను ఆదేశించింది. పరిహారం చెల్లించాలని చట్టంలో విస్పష్టంగా ఉన్నందున దాన్ని అమలు చేసి తీరాలని తేల్చి చెప్పింది. అయితే, కరోనా నివారణకు ఇతర రూపాల్లో సాయం చేస్తున్నామని, కాబట్టి పరిహారం చెల్లించాలేమన్న కేంద్రం వాదనలను తోసిపుచ్చింది. నగదు రూపంలో పరిహారం ఇస్తే ఇతర కార్యక్రమాలకు నిధులు కొరత ఏర్పడతుందన్న వాదనలతో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఏకీభవించలేదు. అయితే, ఎక్స్‌గ్రేషియా కింద ఎంత ఇవ్వాలన్నదానిపై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, కేంద్ర ప్రభుత్వమే కనీస ప్రమాణాలుగల మొత్తాన్ని నిర్ధరించాలని సూచించింది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని పరిహారం విషయంలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కరోనా మృతుల కుటుంబాలకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ న్యాయవాదులు రీపక్‌ కన్సల్‌, గౌరవ్‌ కుమార్‌ బన్సల్‌లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన ధర్మాసనం బుధవారం తీర్పు ఇచ్చింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాల తరఫున న్యాయవాది సుమీర్‌ సోధి నాలుగు మధ్యంతర నివేదికలను సమర్పించారు. పరిహారం చెల్లింపులో వివక్ష ఉండకూడదని, దేశవ్యాప్తంగా ఒకే తరహా మొత్తం ఉండాలని ఆయన కోరారు. ఒక రాష్ట్రంలో ఎక్కువ, మరో రాష్ట్రంలో తక్కువగా పరిహారం ఉండకుండా కేంద్రమే ఏకరూప విధానాన్ని రూపొందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘పరిహారం నిర్ణయించడం వంటి వ్యవహారాల్లో సాధారణంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు.. అసాధారణత, ప్రభావం, విస్తృతి దృష్ట్యా రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించలేం’’ ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. ‘ఆర్థిక స్థోమత’ పెద్ద సమస్యకాకపోయినా, రూ.4లక్షల పరిహారం చెల్లింపు విషయమై ఇతర అంశాలనూ గమనించాల్సి ఉందని కేంద్రం తెలిపింది. జాతి సంపద వినియోగంలో ‘హేతుబద్ధత, వివేకం, గరిష్ఠ ప్రయోజనం’ వంటి అంశాలను పరిశీలించాలని పేర్కొంది. అనంతరం అదనపు అఫిడ్‌విట్ దాఖలు చేసిన కేంద్రం.. కరోనా వంటి విపత్తులు జీవితంలో ఒకేసారి వస్తాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చూపిందని తెలిపింది. నిపుణుల సూచనల మేరకు వివిధ రూపాల్లో సహాయం అందిస్తున్నామని, మళ్లీ నగదు రూపంలో చెల్లించడం ఎందుకని ప్రశ్నించింది.


By July 01, 2021 at 07:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-asks-centre-to-fix-ex-gratia-for-covid-victims-in-6-weeks/articleshow/84007174.cms

No comments