అప్రూవర్‌గా మారిన నీరవ్ మోదీ సోదరి.. భారత ప్రభుత్వానికి రూ.17 కోట్ల జమ!
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నిందితురాలు అప్రూవర్‌గా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతడి సోదరి పుర్వీ మెహతా నిందితురాలిగా ఉండగా.. అప్రూవర్‌గా మారారు. తాజాగా, భారత ప్రభుత్వానికి ఆమె రూ.17.25 కోట్ల పంపినట్టు ఈడీ తెలిపింది. యూకేలోని తన బ్యాంకు ఖాతా నుంచి ఈ మొత్తాన్ని జూన్ 24న పుర్వీ పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. తన సోదరుడు నీరవ్ సూచన మేరకు పుర్వీ ఖాతాను తెరిచారని, అందులోని నగదుతో ఆమెకు సంబంధం లేదని ఈడీ పేర్కొంది. పీఎన్‌బీ కుంభకోణం కేసు విషయంలో సహకరించేందుకు , ఆమె భర్త మయాంక్ మెహతాకు ఈ ఏడాది జనవరిలో ఈడీ అనుమతిచ్చింది. దీంతో ఆమె అప్రూవర్‌గా మారిన ఆమె.. ఈ క్రమంలో 23,16,889.03 డాలర్లను తన యూకే ఖాతా నుంచి భారత ప్రభుత్వానికి బదిలీ చేశారని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. పుర్వీ మెహతా సహకారంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు ప్రస్తుతం యూకే జైలులో ఉన్న నీరవ్ మోదీ.. తనను భారత్‌కు అప్పగించకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.నీరవ్ గతవారం యూకే హైకోర్టులో దీనిపై అప్పీల్ చేయగా కోర్టు తొలి దశ విచారణ పూర్తిచేసింది. యూకే హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ ఉత్తర్వులు వెలువడిన దాదాపు రెండు నెలల తర్వాత కోర్టు నిర్ణయం వచ్చింది. నీరవ్‌ను వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, న్యాయపరమైన చిక్కులున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది.
By July 02, 2021 at 07:47AM
No comments