Breaking News

భారత్‌నెట్ ప్రాజెక్టుకు ఆమోదం.. 16 రాష్ట్రాల్లోని 3.6 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్


గ్రామీణ ప్రాంతాలకు అంతర్జాల సేవల కోసం ఉద్దేశించిన భారత్ నెట్ ప్రాజెక్టుకు బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో అమలు చేయనున్నారు. మొత్తం 16 రాష్ట్రాల్లో 3.6 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.29,000 కోట్లు ఖర్చు చేయనుండగా.. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.19,041 కోట్లు కేంద్రం అందజేయనుంది. గతేడాది ఆగస్టు 15న భారత్ నెట్ ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. భారత్ నెట్ ప్రాజెక్ట్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర ఐటీ సమాచార మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.19,041 కోట్లకు ఆమోదం తెలిపిందని, మిగతా నిధులను ఆయా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు సమకూర్చనున్నాయని తెలిపారు. భారత్ నెట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు అంతర్జాల సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ‘16 రాష్ట్రాల్లోని 3,61,000 గ్రామాల్లో ఇంటర్నెట్‌ బ్రాడ్‌బాండ్‌ కనెక్టివీటీ అందించేందుకు పీపీపీ పద్దతిలో ప్రపంచ స్థాయిలో బిడ్డింగ్ నమూనాను అమలు చేయాలి’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేరళ, కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్,అసోం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలో ఈ దశలో ప్రాజెక్ట్ అమల్లో ఉంటుంది. రెండు రోజుల కిందట ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. భారత్‌లోని అన్ని గ్రామాల్లో సమాచార విప్లవం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో అన్ని గ్రామాలు 1,000 రోజుల్లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్‌‌తో అనుసంధానించబడతాయని అన్నారు. భారత్‌ నెట్‌ పథకం కింద 2021, మే 31 నాటికి 1,56,223 గ్రామ పంచాయతీలలో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పథకం కోసం ఇప్పటికే రూ.42,068 కోట్ల కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్‌ తెలిపారు. ఈ పథకానికి తాజాగా రూ.19,041 కోట్లు కేటాయించడంతో దీంతో ఈ పథకం మొత్తం విలువ రూ. 61,109 కోట్లకు చేరుకుంది.


By July 01, 2021 at 07:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-cabinet-approves-bharatnet-will-implement-across-16-states-under-ppp-model/articleshow/84007541.cms

No comments