Breaking News

Wuhan Lab నుంచే కరోనా.. బయటపడ్డ మెయిల్స్.. అమెరికా నిపుణుడు ఫౌచీ హస్తం?!


ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన కరోనా వైరస్‌ మహమ్మారి చైనాలోని ల్యాబ్ నుంచే లీకయ్యిందనే వాదనలు బలపడుతున్నాయి. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి కరోనా బయటకు వచ్చిందనే వాదనలు బలపడే కొద్దీ అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంథోనీ ఫౌచీపై స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ పార్టీ ఏకంగా ఆయనను ఓ అబద్ధాలకోరని దుమ్మెత్తి పోస్తోంది. ఫౌచీ ఈ మెయిల్స్‌ బహిర్గతమైన నేపథ్యంలో ఆరోపణలను తీవ్రతరం చేశారు. అధ్యక్షుడు జో బైడెన్‌ సలహాదారు పదవి నుంచి ఫౌచీ వైదొలగాలని డిమాండ్‌ చేస్తున్నారు. కరోనా మూలాల విషయంలో చైనాను సమర్థించేలా గతంలో ప్రకటనలు చేసి అమెరికన్లను తప్పుదారి పట్టించారని, ఆయనపై చట్టసభల సభ్యుల కమిటీతో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలనీ రిపబ్లికన్‌ సెనెటర్‌ జోష్‌ హావ్‌లే కోరారు. వుహాన్‌ ల్యాబ్‌లో ఏమి జరిగిందో నిజంగా ఆయనకు తెలియదా? లేదా అన్నీ తెలిసే.. అబద్ధాలు చెప్పారా? అన్న అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల సమాచార స్వేచ్ఛ కింద ఫౌచీ ఈ మెయిల్స్‌ కొన్ని మీడియాకు బహిర్గతం అయ్యాయి. తొలి నాళ్లలో ల్యాబ్‌ లీక్‌ థియరీని బలంగా వ్యతిరేకించిన ఫౌచీ.. ఇటీవల మాట మార్చారు. ‘వుహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీకయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం’ అని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. కరోనా వ్యాప్తి తొలినాళ్లలో డాక్టర్‌ ఫౌచీకి.. వైద్య నిపుణుడు క్రిస్టియన్‌ అండర్సన్‌ ఒక ఈమెయిల్‌ పంపారు. ‘వైరస్‌కు ఉన్న అసాధారణ లక్షణాలు చూస్తుంటే దీనిని ల్యాబ్‌ సెట్టింగ్స్‌లో మార్చారేమో అనిపిస్తోంది’ అని అందులో పేర్కొన్నారు. కానీ తర్వాత ఆయనే ల్యాబ్‌ లీక్‌ థియరీకి ఆధారాల్లేవని ఓ పత్రాన్ని సమర్పించారు. మరోవైపు, డాక్టర్‌ ఫౌచీ ఈ వైరస్‌ సహజంగానే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందనే వాదనలను బలపరిచారు. వాస్తవానికి ఏ జంతువు నుంచి కరోనా వచ్చిందో ఇప్పటికీ తెలియదు. తాజాగా ఫౌచీ కూడా ల్యాబ్‌ లీక్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో తన సహాయకుడు హ్యూజ్‌ ఔచిన్‌క్లోస్‌కు కరోనా వైరస్‌లపై చేసిన గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్స్‌ పరిశోధన పత్రాన్ని డాక్టర్ ఫౌచీ మెయిల్ చేసి.. దీనిని చదవాలని ఆదేశించారు. దీనికి అతను ‘విదేశాల్లో జరిగిన ఈ పరిశోధనకు, మనకు ఏమైనా సంబంధాలున్నాయా అనేది తెలుసుకుంటాను’ అని బుదలిచ్చారు. ‘న్యూస్‌ నేషన్‌ నౌ’అనే కార్యక్రమంలో ఫౌచీ మాట్లాడుతూ.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్‌ (ఎన్ఐహెచ్) నిధులను కరోనా వైరస్‌లపై పరిశోధనలకు వెచ్చించడంపై స్పందించారు. శాంపిల్స్ సేకరణకు మాత్రమే ఎకో హెల్త్‌ ఫౌండేషన్‌కు నిధులు సమకూర్చామని ఫౌచీ స్పష్టం చేశారు. కానీ, వుహాన్‌ ల్యాబ్‌లో అన్నీ మేము అనుకున్నట్లే జరుగుతాయని హామీ ఇవ్వలేనని పేర్కొన్నారు. తన ఈ-మెయిల్స్‌ను తప్పుగా అన్వయించుకొంటున్నారని వ్యాఖ్యానించారు. కాగా, 2014-19 మధ్య ఐదేళ్లలో ఎన్ఐహెచ్ నుంచి ఎకో హెల్త్‌ అలయెన్స్‌కు.. అక్కడి నుంచి వుహాన్‌ ల్యాబ్‌కు 3.4 మిలియన్‌ డాలర్లు నిధులు వెళ్లాయి. ఎకో హెల్త్‌కు వుహాన్‌ ల్యాబ్‌తో సంబంధాలు ఉన్నాయి. కాగా, దీని యజమాని పీటర్‌ డెస్జోక్‌ గతేడాది ఏప్రిల్‌ 20నదీ ఫౌచీకి ఒక మెయిల్‌ పంపారు. ‘మా మిత్రులు, భాగస్వాముల తరఫున మీరు నిలబడినందుకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.. వైరస్‌ పుట్టుక సహజమైనదే అన్న వాదనకు మీ మద్దతుతో శాస్త్రపరంగా బలం చేకూరింది. విశ్వసనీయమైన మీ మాటలు వైరస్‌ పుట్టుకపై అనుమానాలను దూరం చేస్తాయి’ అని అందులో పేర్కొన్నారు. కరోనా వైరస్ నుంచే బయటకు వచ్చినట్టు గతంలో చెప్పిన చైనా వైరాలజిస్ట్ లీ-మెంగ్ యన్.. తాజాగా తాను చెప్పిందే నిజమైనట్టు ఫౌచీ మెయిల్స్‌ను చెబుతున్నాయని అన్నారు.


By June 06, 2021 at 12:04PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/chinese-virologist-says-dr-fauci-emails-prove-her-wuhan-lab-leak-claims/articleshow/83278119.cms

No comments