Breaking News

‘మమతా బెనర్జీ Weds సోషలిజం’.. కమ్యూనిస్ట్ నేత కుమారుడి పెళ్లి శుభలేఖ వైరల్!


తమిళనాడుకు చెందిన ఓ యువ జంట వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వధూవరుల పేర్లు పి.మమతా బెనర్జీ, ఏఎం సోషలిజం కావడమే ఇందుకు కారణం. ఈ శుభలేఖ నిజమైందేనా? అనే అంశంపై నెట్టింటిలో తీవ్ర చర్చ జరుగుతోంది. శుభలేఖలో వరుడి సోదరుల పేర్లు ఏఎం కమ్యూనిజం, ఏఎం లెనినిజం అని ఉండటం గమనార్హం. అయితే, ఆ సందేహాల వరుడి తండ్రి లెనిన్‌ మోహన్‌ తెరదించారు. ఈ శుభలేఖ వాస్తవమేనని తేల్చారు. సేలం జిల్లా సీపీఐ కార్యదర్శి లెనిన్‌ మోహన్‌.. తన కుమారులు సహా వధువు పేర్ల వెనుక ఉన్న కారణాలను వివరించారు. కమ్యూనిజంపై అభిమానంతోనే కుమారులకు అలాంటి పేర్లు పెట్టినట్టు ఆయన తెలిపారు. తన స్వగ్రామం కత్తూరులో ఎక్కువ మంది కమ్యూనిజాన్ని అభిమానిస్తారని.. అందుకే అక్కడ రష్యా, మాస్కో, జెకోస్లోవేకియా, రొమేనియా, వియత్నాం, వెన్మణి లాంటి పేర్లు సాధారణంగా వినిపిస్తాయని పేర్కొన్నారు.ః వధువు కూడా తమ బంధువుల అమ్మాయేనని, ఆమె తాతయ్య కాంగ్రెస్‌ పార్టీ నేత అని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి స్ఫూర్తి పొంది అమె పేరునే తన మనవరాలికి పెట్టినట్టు పేర్కొన్నారు. తమ భావజాలాన్ని ముందు తరాలకు తీసుకెళ్లడానికి తన మనవడికి మార్క్సిజం అని పేరు పెట్టినట్టు తెలిపారు. భవిష్యత్తులో తమ ఇంట్లో అమ్మాయి పుడితే ఆమెకు క్యుబాయిజం అని నామకరణం చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. కొవిడ్‌ నేపథ్యంలో శుభలేఖను సీపీఐ అధికారిక పత్రిక ‘జనశక్తి’లో సోమవారం ప్రచురించడంతో అందరి దృష్టినీ ఆకర్షించిందని మోహన్‌ వ్యాఖ్యానించారు. ఇది నిజమా? కాదా అని నిర్ధారించుకోడానికి మూడు రోజులుగా సన్నిహితులు, మీడియా నుంచి 300కి పైగా ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టు చెప్పారు. విభిన్నమైన పేర్లు పెట్టుకున్నందుకు అందరూ అభినందిస్తుండటంతో తన కుమారులు కూడా సంతోషంగా ఉన్నారని తెలిపారు. జూన్ 13న ఈ వివాహం జరగనుంది. ‘‘సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత కమ్యూనిజం కనుమరుగవుతుందని చెప్పారు.. ఈ సిద్ధాంతాలను ప్రపంచంలో ఎక్కడా ఆచరించరని అన్నారు.. దూరదర్శన్‌లో దీనిపై న్యూస్ క్లిప్పింగ్ వేశారు.. ఇదే సమయంలో గర్భంతో ఉన్న నా భార్య కుమారుడ్ని ప్రసవించింది.. మానవ జాతి ఉనికిలో ఉన్నంత వరకు కమ్యూనిజం ఉంటుందని నేను నమ్ముతున్నందున నా పెద్ద కుమారుడికి కమ్యూనిజం అని పేరు పెట్టాలని వెంటనే నిర్ణయించుకున్నాను’’ అని తెలిపారు. ‘నేతలు, దేశాలు, సిద్ధాంతాలు.. ఇలా ప్రజల తమ పిల్లలకు పేర్లను పెడతారు.. కాబట్టి నా పిల్లలకు సిద్ధాంతాలతోనే ఈ పేర్లను పెట్టాను’ అని మోహన్ పేర్కొన్నారు. నా పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని, పేర్ల కారణంగా అవమానాలను ఎదుర్కొన్నారని అన్నారు. అయితే కాలేజీకి వచ్చేసరికి పరిస్థితి కొంత మారిందన్నారు. పెద్ద కొడుకు లా పూర్తిచేయడా.. మిగతా ఇద్దరూ బీకామ్ చదువుకున్నారని తెలిపారు.


By June 11, 2021 at 09:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mamata-banerjee-to-marry-am-socialism-in-tamil-nadu-wedding-card-goes-viral/articleshow/83422816.cms

No comments