Breaking News

Unlockపై మహారాష్ట్ర యూటర్న్.. మంత్రి ప్రకటనపై CMO క్లారిటీ


మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టించింది. ఒకానొక దశలో రోజువారీ కేసులు 65వేల మార్క్‌కు చేరువయ్యాయి. దీంతో ఏప్రిల్ మధ్య నుంచి మహమ్మారి కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. ప్రస్తుతం పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఐదు అంచెల అన్‌లాక్‌ ప్రక్రియను అమలు చేయనున్నట్టు ఉద్ధవ్‌ ఠాక్రే సర్కారు గురువారం ప్రకటించింది. అయితే, అంతలోనే యూటర్న్ తీసుకుంది. అన్‌లాక్ ప్రక్రియపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుత ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు, ఆక్సిజన్ పడకల ఖాళీ ఆధారంగా అన్‌లాక్‌ ప్రక్రియను ఐదు అంచెల్లో చేపట్టాలని నిర్ణయించినట్టు మహారాష్ట్ర సహాయ పునరావాస మంత్రి విజయ్ వడ్డేట్టివార్ గురువారం సాయంత్రం ప్రకటించారు. లెవెల్-1 అంటే లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయడమని, లెవెల్-5 అంటే రెడ్ జోన్‌గా పరిగణించి పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని మంత్రి వివరించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ తర్వాత మంత్రి మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. థానే సహా 18 జిల్లాలు లెవెల్-1లో ఉన్నాయని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా క్రమంగా ఒక్కోరంగంలో అన్‌లాక్‌ అమలు చేస్తారు. గతేడాది కరోనా తర్వాత కేంద్రం అమమలు చేసిన తరహాలోనే ఈ అన్‌లాక్‌ ప్రక్రియ ఉండబోతోంది. తొలి దశలో థానేతో పాటు 18 జిల్లాల్లో ఆంక్షలు సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో దశలో మిగిలిన జిల్లాల్లో ఆంక్షల్ని సడలిస్తారు. అయితే, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మాత్రం ఆంక్షల్ని పూర్తిగా సడలించమని, లెవెల్-2లో ఉంటుందని అన్నారు. సబర్బన్ ట్రైన్లు, మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వడం లేదని, తర్వాతి దశల్లో ముంబైలో రవాణా వ్యవస్ధపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంత్రి మీడియా ముందు చెప్పడంతో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమవుతుందని విస్తృత ప్రచారం జరిగింది. కానీ, మంత్రి ప్రకటన చేసిన కొద్ది సేపటికే ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై స్పష్టతనిస్తూ.. అన్‌లాక్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ‘‘కరోనా వైరస్‌ను పూర్తిగా అదుపుచేయలేదు.. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల మహమ్మారి వ్యాప్తి పెరుగుతోంది.. కరోనా ఘోరమైన, మారుతున్న రూపాన్ని పరిశీలిస్తే, ఆంక్షలను సడలించాలా వద్దా అని నిర్ణయించుకోవాలి.. రాష్ట్రంలో ఆంక్షలు ఎత్తివేయలేదు’’ అని పేర్కొంది. ‘‘కరోనా కట్టడి పరిమితుల్లో సడలింపు ప్రారంభించింది.. విపత్తు నిర్వహణ విభాగం ఐదు దశల్లో వీక్లీ పాజిటివ్ రేటు, ఆక్సిజన్ పడకల లభ్యత ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రమాణాల ఆధారంగా రాష్ట్రంలో ఆంక్షలను కఠినతరం చేయడానికి లేదా సడలించడానికి వివరణాత్మక మార్గదర్శకాలను ప్రభుత్వం తెలియజేస్తుంది’’ అని తెలిపింది. అయితే, ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ అపరిపక్వానికి ఇది నిదర్శనమని బీజేపీ దుయ్యబట్టింది.


By June 04, 2021 at 11:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/minister-announces-five-level-unlock-plan-maharashtra-government-clarified/articleshow/83227442.cms

No comments