Breaking News

బీజేపీ నుంచి సొంతగూటికి.. త్వరలో TMCలోకి 8 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు!


పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ పార్టీని వీడి బీజేపీలో చేరినవారంతా తిరిగి సొంతగూటికి చేరుకోవడానికి తహతహలాడుతున్నారు. ఎన్నికల ముందు పలువురు నేతలు టీఎంసీని వీడటంతో మమతా బెనర్జీకి ఓటమి తప్పదని ప్రచారం జరిగింది. ఈ సవాళ్లను ధీటుగా ఎదుర్కొన్న దీదీ.. ఎత్తులను చిత్తుచేశారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించి తన సత్తా చాటారు. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో 292 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 213, బీజేపీ 77 సీట్లను గెలుచుకున్నాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం బీజేపీ నుంచి టీఎంసీలోకి వలసలు ఊపందుకున్నాయి. తిరిగి సొంత పార్టీలోకి రావాలని చాలా మంది తహతహలాడుతున్నారు. మార్చిలో టీఎంసీ నుంచి బయటకొచ్చిన మాజీ ఎమ్మెల్యే సోనాలీ గుహ.. తన పరిస్థితి నీటిలో నుంచి ఒడ్డునపడ్డ చేపలా ఉందని ఇటీవల వ్యాఖ్యానించారు. రాజకీయ నేతగా మారిన ఫుట్‌బాల్ ఆటగాడు దీపేందు బిశ్వాస్ తాజాగా మమతాకు లేఖ రాశారు. తాను టీఎంసీ జెండా కప్పుకోడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అలాగే, సరళ ముర్ము, అమల్ ఆచార్య వంటి పలువురు నేతలు కూడా తిరిగి బీజేపీ నుంచి టీఎంసీకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు కొద్ది వారాల ముందు పార్టీని వీడిన మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీ సైతం పునరాగమనానికి సిద్ధంగా ఉన్నారు. ‘‘కేవలం నేతలే కాదు, ఎనిమిది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టీఎంసీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. అయితే, వీరి విషయంలో పార్టీ అధిష్ఠానం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ‘‘కానీ, పార్టీ శ్రేణుల మనోభావాలను కూడా గౌరవిస్తాం.. ఎన్నికలకు ముందు ఈ నేతలంతా పార్టీని వీడినా.. నాయకత్వంలో కార్యకర్తలు, నాయకులు విజయం కోసం పనిచేశారు’’ అని ఘోష్ వ్యాఖ్యానించారు. కాగా, సీనియర్ నేత ముకుల్ రాయ్ తిరిగి టీఎంసీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ ఆయన కుమారుడు పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్ దీనికి బలం చేకూర్చేలా ఉంది. ఒకప్పుడు మమతా బెనర్జీకి సన్నిహితుడిగా ఉన్న రాయ్.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ముకుల్ రాయ్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ ప్రచారాన్ని బీజేపీ వర్గాలు తోసిపుచ్చాయి. ‘‘టీఎంసీ అధికారం కోల్పోయి బీజేపీ విజయం సాధిస్తుందని ఊహించారు. మా పార్టీలో చేరినప్పుడు చాలా మంది నేతలు ఏడ్చారు.. ఇప్పుడు నవ్వుతూ పార్టీ వీడుతున్నారు.. వారు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్లిపోతున్నారనేది ప్రజలు గమనిస్తున్నారు’’ అని బెంగాల్ బీజేపీ నేత షమిక్ భట్టాచార్య అన్నారు. కొద్ది మంది నేతలే బహిరంగంగా టీఎంసీలో చేరుతామని ప్రకటించగా.. పలువురు గుంభనంగా ఉన్నారు.


By June 01, 2021 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/month-after-trinamool-win-in-assembly-polls-defectors-who-joined-bjp-queue-up-to-return/articleshow/83135657.cms

No comments