Breaking News

భారత్‌కు టీకాలు పంపుతున్నాం.. Modiకి కమలా హ్యారిస్ ఫోన్


తన వద్ద అదనంగా ఉన్న 80 మిలియన్ (8 కోట్ల) డోస్‌ల టీకాలను జూన్ నెలాఖరు నాటికి ప్రపంచ దేశాలకు పంచనున్నట్టు గత నెలలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి విడతగా... 2.5 కోట్ల డోస్‌లను పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో 1.9 కోట్ల డోసులను దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకు అందజేయనున్నారు. లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలకు 60 లక్షలు, దక్షిణాసియా, ఆగ్నేయాసియాకు 70 లక్షలు... ఆఫ్రికాకు 50 లక్షల డోసులు సరఫరా చేస్తామని జో బైడెన్‌ గురువారం ప్రకటించారు. మిగతా 60 లక్షల డోస్‌లను కొవిడ్‌ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న భారత్‌, మెక్సికోలతో పాటు కెనడా, దక్షిణ కొరియాలకు నేరుగా పంపిస్తామని బైడెన్‌ వివరించారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీకి వైస్-ప్రెసిడెంట్ ఫోన్‌ చేసి పంపుతున్న వ్యాక్సిన్ల సమాచారాన్ని పంచుకున్నారు. అలాగే, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రస్ మాన్యుల్ లోపేజ్ ఒబ్రేడర్, గ్యాటమాలా అధ్యక్షుడు అల్జెండ్రో గియామాట్టేయ్, కరేబియా దీవుల ఛైర్మన్, ప్రధాని కైథీ రౌలే‌లకు కూడా హ్యారిస్ ఫోన్ చేసి, టీకాలు పంపుతున్న విషయం చెప్పారు. వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నప్పుడే అమెరికా తన అవసరాలకంటే ఎక్కువగా ముందస్తు కొనుగోళ్లు చేసింది. దేశంలోని మొత్తం జనాభాకు టీకాలు పూర్తయినా భారీ స్థాయిలో (సుమారు 8 కోట్లు) మిగిలిపోయేంతగా నిల్వలు సమకూర్చుకుంది. వాటిని వృథాగా నిల్వ ఉంచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బైడెన్‌ ప్రభుత్వం మిగులు టీకాలను ప్రపంచానికి పంచాలని నిర్ణయం తీసుకుంది. ‘‘విస్తృత ప్రపంచంలో ఉప్పెనలు, ఇతర అత్యవసర పరిస్థి తులు, ప్రజారోగ్య అవసరాలకు ప్రతిస్పందించడం.. టీకాలు వీలైనన్ని దేశాలకు అందజేయయడంపై యంత్రాంగం ప్రయత్నాలను ఉపాధ్యక్షురాలు పునరుద్ఘాటించారు’’ అని వైట్‌హౌస్ సీనియర్ సలహాదారు, చీఫ్ అధికార ప్రతినిధి సైమోనే శాండెర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా టీకాలు పంపడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అమెరికా సాయంపై ప్రశంసలు కురిపించిన ప్రధాని.. కమలా హ్యారిస్‌కు ధన్యవాదాలు తెలిపారు. విదేశాలకు 80 మిలియన్ డోస్‌లను అందజేయనున్నామని, ఇది అమెరికాలో ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 13 శాతమని బైడెన్ గత నెలలో పేర్కొన్నారు. వీటిని జూన్ చివరి నాటికి పంపిణీ చేస్తామని వివరించారు.


By June 04, 2021 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/appreciate-assurance-of-vaccine-supplies-pm-modi-after-kamala-harris-call/articleshow/83224688.cms

No comments