Kashimr Encounter లష్కరే టాప్ కమాండర్ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల భరతం పడుతోన్న భారత సైన్యం.. సోమవారం తెల్లవారుజామున ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టింది. వీరిలో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా టాప్ కమాండర్ ఉన్నట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. బారాముల్లా జిల్లా సోపోర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే ఉగ్రవాది ముదాసిర్ పండిట్ సహా ముగ్గురు హతమైనట్టు వెల్లడించారు. సోపోర్‌లోని గుండ్ బ్రత్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. గుండ్ బ్రత్ వద్ద ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న భద్రత బలగాలు ఆదివారం అర్ధరాత్రి ఆ ప్రాంతానికి చేరుకుని విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలో భద్రత బలగాలపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమయిన సైన్యం ఎదురు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరగ్గా.. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ వివరాలను కశ్మీర్ ఐజీపీ ట్విట్టర్‌లో తెలిపారు. సోపోర్ ఎన్‌కౌంటర్‌లో ముదాసిర్ పండిట్‌ను మట్టుబెట్టినట్టు చెప్పారు. ‘‘ఇటీవల సోపోర్‌లో ముగ్గురు పోలీసులు, ఇద్దరు కౌన్సెలర్లు, మరో ఇద్దరు పౌరుల హత్యల వెనుక ఉన్న లష్కరే తొయిబా కమాండర్ ముదాసిర్ పండిట్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు’’ అని ట్వీట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో సోపోర్‌లో ఓ సమావేశం జరుగుతుండగా ఉగ్రవాది ముదాసిర్ కాల్పులకు తెగబడటంతో ఇద్దరు బీజేపీ కౌన్సెలర్లు, ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి జూన్ 24న ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహణకు సిద్ధమైన వేళ ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
By June 21, 2021 at 08:14AM
No comments