Breaking News

Covid Mutation మహిళకు 216 రోజులుగా కరోనా.. ఆమెలో 32 రకాల మ్యుటేషన్లు!


విజృంభణతో ఏడాదిన్నరగా ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకే కరవయ్యింది. ఎప్పటికప్పుడు జన్యుమార్పిడిలతో కొత్త రూపం దాల్చి మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా, దక్షిణాఫ్రికాలోని ఓ మహిళ శరీరంలో కరోనా వైరస్‌ మ్యుటేషన్స్‌‌ను పరిశోధకులు గుర్తించారు. హెచ్‌ఐవీతో బాధపడుతున్న ఆ 36 ఏళ్ల మహిళ.. గత 216 రోజుల నుంచి కోవిడ్‌తో పోరాడుతోంది. కరోనా సోకినప్పటి నుంచి ఆమె శరీరంలో 32 రకాలుగా వైరస్ ఉత్పరివర్తనం చెందినట్లు పరిశోధనలో వెల్లడయ్యింది. ఈ అసాధారణ కేసుకు సంబంధించిన వివరాలను మెడికల్‌ జర్నల్‌ మెడ్రిక్స్‌వి గురువారం ప్రచురించింది. అయితే, దీనిపై ఇప్పటివరకూ పునఃపరిశీలన జరపలేదు. బాధిత మహిళకు 2006లో తొలిసారి హెచ్‌ఐవీ బయటపడింది. దీంతో క్రమంగా ఆమె రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తూ వచ్చింది. గతేడాది సెప్టెంబరులో కరోనా బారిన పడింది. అప్పటి నుంచి ఆమెలో కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ 13 రకాలుగా ఉత్పరివర్తనం చెందగా, జన్యుపరంగా 19 రకాలుగా రూపాంతరం చెందింది. E484K, B.1.1.7, N510Y, B.1.351 ఇలా ఆమె శరీరంలో పలు రకాలుగా కరోనా ఉత్పరివర్తనం చెందడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఆ మహిళలో మ్యుటేషన్‌ చెందిన స్ట్రెయిన్‌లు ఆమె నుంచి ఇతరులకు వ్యాపించినట్టు స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలోని క్వాజులు నాటాల్ వంటి ప్రాంతాలలో చాలా కొత్త రకాలు ఉద్భవించడ యాదృచ్చికం కాదు, ఎందుకంటే ఇక్కడ ప్రతి నలుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది హెచ్‌ఐవీ పాజిటివ్ బాధితులేనని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఐవీ బారిన పడిన వారు కరోనా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు, తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. హెచ్‌ఐవి సోకిన వారు కోవిడ్ -19కు సంక్రమించే అవకాశం ఉందని.. తీవ్రమైన వైద్య పరిణామాలను అభివృద్ధి చేస్తారని సూచించడానికి ఆధారాలు చాలా తక్కువగా ఉన్నప్పటి.. ఇలాంటి కేసులు ఎక్కువగా బయటపడితే హెచ్ఐవీ రోగులు ‘మొత్తం ప్రపంచానికి వేరియంట్స్ కర్మాగారంగా మారవచ్చు’ అని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. రోగనిరోధకశక్తి కలిగిన రోగులు కోవిడ్ వైరస్‌ను దీర్ఘకాలంగా ఇతరులకు వ్యాపింపజేసే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ క్వాజుల్-నాటల్ శాస్త్రవేత్త, పరిశోధన ఆథర్ డాక్టర్ తులియో డి ఒలివెైరా అన్నారు. సదరు మహిళకు కోవిడ్ తొలినాళ్లలో స్వల్ప లక్షణాలు బయటపడ్డాయని, ప్రస్తుతం ఆమెలో వైరస్ ఇంకా ఉందని అన్నారు. ‘హెచ్‌ఐవీ నిర్ధారణకాని వ్యక్తులకు టెస్టింగ్, ట్రీట్మెంట్‌ను పెంచడం వల్ల మరణాలను, వ్యాప్తిని తగ్గిస్తుంది.. ఇతర కోవిడ్ వేరియంట్‌లను ఉత్పత్తి చేసే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది.. ఇవి ఇతర వేవ్‌ల ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతాయి’ అని అన్నారు.


By June 07, 2021 at 06:58AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/hiv-woman-carries-covid-19-for-216-days-develops-32-virus-mutations-inside-her-body-in-south-africa/articleshow/83296905.cms

No comments