కేంద్ర ఐటీ మంత్రికి ట్విట్టర్ షాక్.. ఏఆర్ రెహమాన్ పాట విషయంలో ఖాతా బ్లాక్!
కొత్త ఐటీ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం, సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీశా మంత్రి రవిశంకర్ ప్రసాద్ అకౌంట్‌ను ట్విటర్ బ్లాక్ చేయడం చర్చనీయాంశమవుతోంది. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ తాత్కాలికంగా ట్విట్టర్ ఖాతాను నిలిపేసింది. దీనిపై కేంద్ర మంత్రి తీవ్రంగా స్పందించడంతో గంట తర్వాత పునరుద్ధరించింది. అంతేకాదు, తమ నిబంధనలు ఉల్లంఘిస్తే మళ్లీ బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. రవిశంకర్ ప్రసాద్ అమెరికన్ డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టాన్ని (డీఎంసీఏ) ఉల్లంఘించారని ట్విట్టర్ ఆరోపించింది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘మా తుఝే సలాం’ పాటను మంత్రి తన ట్వీట్‌లో షేర్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కానీ, పాటపై సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కాపీరైట్ హక్కులున్నాయి. దీంతో ఆ సంస్థ తరఫున ట్విట్టర్‌కు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద ఫొనోగ్రాఫిక్ ఇండస్ట్రీ ఫిర్యాదు చేసింది. డీఎంసీఏ నిబంధనల ప్రకారం కేంద్ర మంత్రి అకౌంట్‌ను ట్విట్టర్ బ్లాక్ చేసింది. తన ఖాతాను నిలిపివేయడం పట్ల ట్విట్టర్ చర్యలపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఖాతాను నిలిపేయడం.. నూతన ఐటీ నిబంధనల్ని ఉల్లంఘించడమేనంటూ ‘కూ’లో వరుస పోస్టులు పెట్టారు. అమెరికన్ డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించానంటూ నా ట్విట్టర్ ఖాతాను గంట పాటు యాక్సెస్ చేసుకోనివ్వలేదని తెలిపారు. చట్టాన్ని ధిక్కరించేలా ట్విటర్ చర్యలున్నాయని, ఈ విషయం గురించి ఇదివరకు పలుమార్లు మాట్లాడినందుకే తన ఖాతాను నిలిపేసి ఉంటారని మంత్రి అభిప్రాయపడ్డారు. ‘భావ ప్రకటన స్వేచ్ఛకు దూతగా చెప్పుకొంటూ, తన సొంత అజెండానే అమలుచేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు ట్విట్టర్ తాజా చర్యతో స్పష్టమైంది. వారి గీతను దాటితే ఖాతాను ఏకపక్షంగా తొలగిస్తామనే హెచ్చరికలు చేస్తున్నారు.’’ అంటూ విరుచుకుపడ్డారు. ‘‘నూతన ఐటీ నిబంధనల్ని ట్విటర్ ఎందుకు నిరాకరిస్తుందో ఇప్పుడు అర్థమవుతోంది. ఒకవేళ అలా అంగీకరిస్తే తమ సొంత అజెండాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఏకపక్షంగా బ్లాక్ చేయలేరు కదా’’ అని ఎద్దేవా చేశారు.
By June 26, 2021 at 07:09AM
No comments