Breaking News

కోవిడ్ పరిహారం చెల్లించకూడదని నిర్ణయించారా? కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం


కరోనా బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడం కుదరదంటూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడ్‌విట్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై సోమవారం నాటి విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ బాధితులకు పరిహారం చెల్లించకూడదని ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. అంతేకాదు, ప్రధాని అధ్యక్షతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ (ఎన్‌ఎండీఏ)లో ఈ మేరకు తీర్మానం చేశారా? అని నిలదీసింది. ఈ సందర్భంగా పరిహారం చెల్లించడం ఆర్థిక సామర్థ్యానికి మించిన వ్యవహారమంటూ కేంద్రం తన అఫిడ్‌విట్‌పై వివరణ ఇచ్చింది. ‘‘దీనర్థం ప్రభుత్వం వద్ద నిధులు లేవని కాదు.. ఎస్డీఆర్ఎఫ్ నిధులతో పరిహారం చెల్లిస్తే వాటిని వైద్యసౌకర్యాల కల్పన, అందరికీ ఆహారం, టీకాల పంపిణీ, ఆర్థిక రంగ ఉద్దీపనలకు కాకుండా ఇతర పనులకు వెచ్చించినట్టు అవుతుందన్నదే తమ ఉద్దేశం’’ అని స్పష్టతనిచ్చింది. కేంద్రం వివరణపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం స్పందిస్తూ ‘‘వివరణ ఇవ్వడం సరిపోయింది.. కేంద్రం వద్ద నిధులు లేవంటే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉండేవి’’ అని వ్యాఖ్యానించింది. విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 12 ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉందని, దానిని ఆర్థిక సంఘం తోసిపుచ్చలేదని పేర్కొంది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. పరిహారం విషయమై ఎన్‌డీఎంఏ ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తనకు తెలియదని అన్నారు. విపత్తు నిర్వహణకు సంబంధించి కేంద్ర హోం శాఖ సమన్వయ సంస్థగా వ్యవహరిస్తోందని వివరించింది. కరోనా మృతుల డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సంక్లిష్టంగా ఉందని, దీనిని సరళీకృతం చేయాలని న్యాయస్థానం సూచించింది. సంక్షేమ పథకాలు అందుకోవడానికి వీలుగా ఇప్పటికే ఇచ్చిన ధ్రువపత్రాల్లో అవసరమైతే మార్పులు చేయాలని తెలిపింది. పరిహారం మంజూరులో ఎవరికీ నష్టం కలగకుండా చూడాలని సూచించింది. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన మార్గదర్శకాలు లేవని ప్రస్తావించింది. శ్మశానాల్లో పనిచేస్తున్న వారికి కూడా కొవిడ్‌ బీమా వర్తింపజేయాలని పేర్కొంది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ ఎస్బీ ఉపాధ్యాయ్ వాదనలు వినినించారు. రెండు గంటల పాటు విచారణ కొనసాగింది. అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది.


By June 22, 2021 at 07:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sc-reserves-verdict-on-rs-4-lakh-compensation-to-kin-of-covid-19-deceased/articleshow/83735115.cms

No comments