Breaking News

కన్నుమూసిన మారిషస్ మాజీ అధ్యక్షుడు.. నేడు సంతాప దినం పాటిస్తున్న భారత్


మారిషస్‌ మాజీ అధ్యక్షుడు సర్‌ అనిరుద్‌ జగన్నాథ్‌ (91) గురువారం కన్నుమూశారు. ప్రస్తుత మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌‌ ఆయన కుమారుడే. అనిరుద్‌ను భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో గత ఏడాది సత్కరించింది. మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రవింద్‌ను ఫోన్‌‌లో పరామర్శించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మోదీ వెల్లడించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని గొప్ప నేతల్లో ఒకరిగా, రాజనీతిజ్ఞుడిగా అనిరుద్‌ను మోదీ అభివర్ణించారు. 1930 మార్చి 29న జన్మించిన అనిరుద్.. లండన్‌ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించారు. కొన్నాళ్లు న్యాయవాదిగా పనిచేసి రాజకీయాల్లో ప్రవేశించారు. తొలిసారిగా 1963లో లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. మారిషస్‌ స్వాతంత్య్రానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు లండన్‌ వేదికగా 1965లో జరిగిన రాజ్యాంగ సదస్సులో ఆయన పాల్గొన్నారు. చగోస్‌ ఆర్చిపెలాగో దీవికి వలస పాలన నుంచి విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ దీవి మారిషస్‌లో భాగమని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ప్రకటించడానికి ఆయన పోరాటమే ప్రధాన కారణం. అనిరుద్‌ 1982 నుంచి 2017 మధ్య ఆరుసార్లు మారిషస్ ప్రధాని పదవిని చేపట్టారు. తొలిసారి 1985 నుంచి 1995, తర్వాత 2000 నుంచి 2003, 2014 నుంచి 2017 వరకు ప్రధానిగా ఉన్నారు. 2003 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. 2017లో కుమారుడు ప్రవింద్‌కు మార్గం సుగమం చేస్తూ ఆయన పదవి నుంచి తప్పుకొన్నారు. 80వ దశకంలో మారిషస్‌ ఆర్ధిక పితామహుడిగా ఘనత సాధించారు. ఆయన అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. అనిరుద్‌ జగన్నాథ్‌ మృతికి భారత ప్రభుత్వం ఒకరోజు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. శనివారం అధికారిక వినోద కార్యక్రమాలేవీ నిర్వహించబోమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయనున్నట్లు వెల్లడించింది.


By June 05, 2021 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/state-mourning-declared-in-india-over-demise-of-ex-mauritius-president-anerood-jugnauth/articleshow/83253881.cms

No comments