Breaking News

సీఎం మార్పుపై జోరుగా ప్రచారం.. రాజీనామాపై యడ్డీ సంచలన వ్యాఖ్యలు


కర్ణాటక ముఖ్యమంత్రి ఏడాది నుంచి తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. దినదిన గండంగా పదవిలో కొనసాగుతున్న యడ్డీపై సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. సీఎం పదవి నుంచి యడియూరప్పను అధిష్ఠానం తప్పిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని సీఎం యడ్డీ తోసిపుచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పూర్తికాలం తాను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని, తనపై అధిష్ఠానానికి నమ్మకం ఉందన్నారు. ఈ విషయంలో ఎటువంటి గందరగోళానికి తావులేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, బీజేపీలో తనకు ప్రత్యామ్నాయ ఎవరూ కాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘ఢిల్లీ పెద్దలకు నాపై నమ్మకం ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతాను.. నమ్మకం కోల్పోయిన రోజున పదవి నుంచి తప్పుకుంటా.. రాష్ట్రాభివృద్ధి కోసం రేయింబవళ్లు పనిచేస్తున్నాను’’ అని యడియూరప్ప అన్నారు. ‘‘ఈ విషయంలో నాకు ఎటువంటి గందరగోళం లేదు.. అధిష్ఠానం నాకు అవకాశం ఇచ్చింది.. దీనిని నా శాయశక్తులా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. మిగతా అంశాలను హైకమాండ్‌కే వదిలేశా’’అని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ నాయకత్వం గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు యడియూరప్ప ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘‘నేను ఎవ్వర్నీ విమర్శించాలనుకోవడంలేదు.. ప్రత్యామ్నాయ వ్యక్తి లేరనే దానిని అంగీకరించను.. ఏ రాష్ట్రంలో లేదా దేశంలో ఎప్పుడూ ప్రత్యామ్నాయ నేతలు ఉంటారు.. కాబట్టి, కర్ణాటకలో ప్రత్యామ్నాయ వ్యక్తులు లేరని నేను అంగీకరించను.. కానీ అధిష్ఠానం నాపై విశ్వాసం కలిగి ఉన్నంత వరకు నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతాను’’ అని కుండబద్దలుకొట్టారు. సీఎం మార్ప తథ్యమని జరుగుతున్న ప్రచారంపై యడియూరప్ప తొలిసారి స్పందించారు. యడియూరప్పను తొలగించాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవల కర్ణాటక టూరిజం మంత్రి యోగేశ్వర్, ధార్వాడ్ వెస్ట్ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్‌లు ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానాన్ని కలిసి.. యడ్డీ విధానాలపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని ఫిర్యాదు చేశారు. కోవిడ్ సంక్షోభం విషయంలోనూ యడ్డీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో అవినీతిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాహటంగా గళమెత్తడం యడ్డీకి కొంత తలనొప్పిగా పరిణమించింది.


By June 06, 2021 at 02:11PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/will-resign-the-day-party-leadership-asks-me-to-quit-says-karnataka-cm-bs-yediyurappa/articleshow/83279632.cms

No comments