అయోధ్య ట్రస్ట్ సభ్యుడి అక్రమాలపై ఫేస్‌బుక్ పోస్ట్.. జర్నలిస్ట్‌పై కేసు నమోదు!
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్మాణానికి భూములు కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా, ఆయోధ్య ఆలయ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్, ఆయన సోదరులు భూములను ఆక్రమించుకున్నట్టు జర్నలిస్ట్ ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసినవారిపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఓ జర్నలిస్ట్ సహా మరో ఇద్దరిపై 18 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. విశ్వహిందూ పరిషత్ నేత చంపత్ రాయ్ సోదరుడు సంజయ్ బన్సాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు యూపీ పోలీసులు తెలిపారు. చంపత్ రాయ్, అతడి సోదరుడికి ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణలో ఇప్పటికే బిజ్‌నోర్ పోలీస్ అధికారి క్లిన్ చిట్ ఇచ్చారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. జర్నలిస్ వినీత్ నరైన్ సహా అల్కా లోహిత్, రాజేశ్ అనే మరో ఇద్దరి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ముగ్గురూ కుట్రపూరితంగా వీహెచ్‌పీ నేత నిరాధారమైన ఆరోపణలు చేయడంతో దేశంలోని కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పోలీసులు పేర్కొన్నారు. బిజ్‌నోర్‌లోని వారి స్వగ్రామంలో ఎన్ఆర్ఐ అల్కా లహోతికి చెందిన 20వేల చదరపు మీటర్ల భూమిని ఆక్రమించుకోడానికి చంపత్ రాయ్ తన సోదరులకు సహకరించినట్టు మూడు రోజుల కిందట జర్నలిస్ట్ వినీత్ నరైన్ మూడు రోజుల కిందట తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. దురాక్రమణకు గురైన తన భూమిని స్వాధీనం చేసుకోడానికి లహోతి 2018 నుంచి ప్రయత్నిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌కు విజ్ఞప్తి చేశారన్నారు. ‘ఆరోపణల్లో స్పష్టత కోసం నరైన్‌ను సంప్రదించడానికి ఆయన ఫోన్ నెంబర్ గురించి ఆరాతీశాను.. ఓ నెంబర్‌కు ఫోన్ చేయగా ఓ వ్యక్తి లిఫ్ట్ చేసి తనను తాను రాజేశ్‌గా పరిచయం చేసుకున్నాడు.. నాతో అసభ్యకరంగా మాట్లాడి చంపుతానని బెదిరించాడు’ అని సంజయ్ బన్సాల్ ఆరోపించారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపారు. అయోధ్య జిల్లా సదర్ తహ్‌శీల్ పరిధిలో 1.208 హెక్టార్ల భూమిని ఈ ఏడాది మార్చి 18న ఒక వ్యక్తి రూ.2 కోట్లకు కొంటే, కొన్ని నిమిషాల్లోనే దానిని రూ.18.5 కోట్లకు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ కొనుగోలు చేశారని ఇటీవల యూపీ మాజీ మంత్రి ఆరోపించారు.
By June 21, 2021 at 10:37AM
No comments