కశ్మీర్‌పై నేడే కీలక సమావేశం.. బోర్డర్‌లో హైఅలర్ట్.. సమస్యకు ముగింపు పలుకుతారా?
జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను 2019 ఆగస్టు 5న రద్దుచేసిన కేంద్రం.. కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఆహ్వానం అందుకున్న 14 మంది నేతలు బుధవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా నియంత్రణ రేఖ వెంబడి ప్రాంతాల్లో 48 గంటలపాటు హై అలర్ట్ ప్రకటించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్ష నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా పునరుద్ధరణ, రాష్ట్రహోదా సహా పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జమ్మూ కశ్మీర్‌లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రద్దు చేసిన దాదాపు రెండేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్ నేతలతో కేంద్రం భేటీ కానుండటం గమనార్హం. అయితే, సమావేశ అజెండా ఏమిటన్నది తెలియరాలేదు. ‘‘ప్రభుత్వ అజెండా మాకు అందలేదు. అయినప్పటికీ కేంద్ర సర్కారు మనసులో ఏముందో తెలుసుకునేందుకు ఆహ్వానిత అఖిలపక్ష నేతలందరం సమావేశానికి హాజరవుతున్నాం’’ అని గుప్కార్ కూటమి అధికార ప్రతినిధి, సీపీఎం నేత యూసఫ్ తరిగామి తెలిపారు. జమ్మూ-కశ్మీర్ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తాము ఢిల్లీ వచ్చామన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కోల్పోయిన ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించడం, రాష్ట్ర హోదా సాధన లక్ష్యంతో పీఏజీడీ ఆవిర్భవించింది. జమ్మూ-కశ్మీర్ నుంచి వేరుపడిన లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి రాజ్యాంగబద్ధమైన రక్షణ ఏర్పాట్లను చేయడంతో పాటు ప్రత్యేక చట్టాలను రూపొందించాలని స్థానిక నాయకులు డిమాండ్ చేశారు. జమ్మూ-కశ్మీర్ నేతలతో ప్రధాని సమావేశమవుతున్న సందర్భంగా లడఖ్‌కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు బుధవారం సమావేశమయ్యారు. తమ ప్రాంత సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. అయితే, నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల అంశంపై చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
By June 24, 2021 at 07:02AM
No comments